చిత్రం చెప్పే విశేషాలు
(25-07-2024)
కృష్ణశిలపై విగ్రహాలతో ఆకట్టుకునే యాదాద్రి పంచనారసింహుల దివ్యాలయం రాత్రి వేళ పసిడి వర్ణ విద్యుత్తు వెలుగులతో అలరిస్తోంది. బుధవారం ఉదయం వర్షం కురవగా గచ్చుపై నిలిచిన నీటిలో ఆలయం ప్రతిబింబం భక్తులకు కనువిందు కలిగించింది.
వీరు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కుశ్నపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని ఎనిమిదో తరగతి విద్యార్థులు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తరగతి గది పైకప్పు ఉరుస్తుండటంతో ఇలా గొడుగులు పట్టుకుని పాఠాలు వింటున్నారు.
చుట్టూ వాననీరు మధ్యలో మంచి నీటిబావులు. చుట్టూ ఎర్రటి వాననీరు.. ఉన్న దృశ్యాలు దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి సమీపంలోని బెళ్లిపాడికూటి గ్రామంలో కంటపడ్డాయి. అద్భుతమైన ఈ ప్రకృతి దృశ్యాలను అటవీశాఖ అధికారులు తమ కెమెరాల్లో బంధించారు.
ఈ చిన్నారి పేరు సౌజన్య. తిలక్‌నగర్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. బోనాల పండక్కి తల్లిదండ్రులు ఊరెళ్లడంతో కూరగాయలు విక్రయిస్తూనే చదువుకొంటూ కనిపించింది ఇలా..
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. చిన్న కర్రివానిపాలెం, కొత్తపాలెం ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ స్థాయి కంటే 50 అడుగుల మేర ముందుకు రావడంతో అలల తాకిడితో తీరం కోతకు గురైంది.
ఒకపక్క ముసురు.. మరోపక్క ట్రాఫిక్.. ఆటోలో తీసుకు వెళ్లేందుకు డబ్బుల్లేక హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ నిలోఫర్ ఆస్పత్రి మార్గంలో ఓ దివ్యాంగుడిని వీల్‌ఛైర్‌లోనే ఇంటికి తీసుకువెళుతూ కనిపించారిలా..
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు వంకలు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. అలుగు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పొంగిన ప్రాజెక్టును చూసేందుకు మండలవాసులు వస్తున్నారు.
ఇటీవల విడుదలైన కల్కి చిత్రంలో కథానాయకుడు ప్రభాస్ వినియోగించిన బుజ్జి కారు బాలసముద్రంలోని ఏషియన్ శ్రీదేవి మాల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరంగల్ నగరంలో బుజ్జి వాహనాన్ని చూసి ప్రేక్షకులు అబ్బురపడ్డారు.
ఐటీ కారిడార్‌లో వాహనాల్లో ప్రయాణమంటే హైదరాబాద్ నగరవాసులు హడలెత్తిపోతున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఐకియా వంతెన -కొత్తగూడ మార్గంలో, టీహబ్ రహేజా మైండ్ స్పేస్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిందిలా..
ఎర్రుపాలెం నుంచి ఖమ్మం వెళ్తున్న ప్యాసింజర్ రైలు మోటమర్రి స్టేషన్‌లో నిలిచింది. ఆ సమయంలో స్టేషన్ ఆవరణలో తిరుగుతున్న వానరం ప్యాసింజర్ రైలెక్కి ద్వారం వద్ద కూర్చుంది. రైలు కదిలే వరకు జనాన్ని చూస్తూ కూర్చున్న వానరాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.
నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన ఏరుకొండ శ్రీరాములు, సుగుణమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పత్తి చేనులో తండ్రి గొర్రు తోలుతుండగా.. వారిద్దరూ ఎరువులు వేస్తున్నారు.