చిత్రం చెప్పే విశేషాలు

(26-07-2024)

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి చెరువు నుంచి దిగువకు నీటి విడుదల అయ్యే గేట్ల వద్ద గ్రామానికి చెందిన మత్స్యకారులు వలలు ఏర్పాటు చేశారు. అంబటి ప్రవీణ్‌ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన వలకు 20 కిలోల భారీ బొచ్చ రకం చేప చిక్కింది. 

ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారిని పలు రకాల కూరగాయలతో శాకంబరీగా అలంకరించారు. ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థిని తలారి నిఖిత కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ను పురస్కరించుకుని రావి ఆకుపై దేశ సైనికులు, త్రివర్ణ పతాకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. 

 ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం దర్బతండాకు చెందిన విద్యార్థులు వడూర్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి విద్యనభ్యసిస్తుంటారు. వర్షానికి రెండు కిలోమీటర్ల పొడవున్న దారి బురదమయంగా మారడంతో ఆటో దిగబడింది. 

దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. తనకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని గుర్తుచేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించారు. 

కర్ణాటకలోని తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో 30 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గురువారం రాత్రి డ్యాం గేట్లు విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఇలా తళుకులీనాయి.

విశాఖపట్నం పోర్టుకు అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్‌ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. 

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చర జలపాతానికి వరద నీరు పోటెత్తింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.  

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని చెరువులు, కుంటల్లోకి భారీగా వరద చేరి నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో గన్ముకుల గ్రామ పెద్ద చెరువు నిండి మత్తడి పోస్తుంది. దీంతో మండలంలో వరి నాట్లు జోరందుకున్నాయి. 

ఏడాదికి ఒక్కసారైరా బోడకాకర కాయలు వండుకొని తినాలని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రజల్లో నానుడి ఉంది. నిజామాబాద్‌ మార్కెట్, ఆర్మూర్‌ డివిజన్‌లో కొన్ని రోజులుగా ఇవి మార్కెట్‌లోకి వస్తుండగా.. కిలో ధర రూ.200ల పైనే పలుకుతోంది. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home