చిత్రం చెప్పే విశేషాలు
(27-07-2024)
ఇది రెండంతస్తుల మేడ. బీసీ విద్యార్థులకు గ్రూప్స్, పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే టీజీ బీసీ స్టడీ సర్కిల్ భవనం. సైదాబాద్‌లోని లక్ష్మీనగర్‌లో ఉన్న ఈ భవనంపై పుస్తకాలు, చారిత్రక కట్టడాల చిత్రాలు వేయించి.. చూడగానే బుక్ షెల్ఫ్‌లా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
జాలర్ల జీవనశైలికి అద్దంపడుతూ చిత్రకారిణి రమణి మైలవరపు మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడ ప్రాంతంలోని జాలర్లతో కలిసి ఆమె గడిపిన క్షణాలను కెమెరాలో బంధించారు.
అనకాపల్లి జిల్లా కోనాం జలాశయం స్పిల్‌వే గేట్ల నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. గట్టుపై నుంచి ముత్యాల ధారలా పడుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
పారిస్ వేదికగా ఒలింపిక్స్ ఆరంభోత్సవంలో భిన్నమైన దృశ్యాలతో క్రీడాకారులు ప్రత్యేకత చాటుకున్నారు. ప్రఖ్యాత ఐఫిల్ టవర్ సమీపంలో, చారిత్రక సెన్ నదిలో క్రీడాకారులు భారీ ఓడల మీద విహరిస్తూ, తమ దేశ జెండాలతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగిన తీరు ముచ్చటగొలిపింది.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మపల్లి సమీపంలోని కెనాల్(కాల్వ) తవ్వకాలు చేపట్టారు. కాల్వలో చేరిన నీటిలో గ్రామానికి చెందిన ఓ యువకుడికి 20 కిలోల చేప లభ్యమైంది. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద చేప లభ్యం కావడం మొదటిసారని స్థానికులు తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నదులు, వాగుల్లో జలకళ సంతరించుకుంది. దీంతో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో ప్రవహించే సర్పానది నారాయణరాజుపేట వంతెన వద్ద చప్టాల మీదుగా ప్రవహిస్తోంది. ఇది మినీ జలపాతాన్ని తలపిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన గర్భిణి సునీతకు వైద్య పరీక్షలు అందించేందుకు వైద్యాధికారి పూజితతో పాటు వైద్య సిబ్బంది కన్నాపూర్ వాగు దాటారు. అక్కడి నుంచి గోపాల్‌పూర్‌కు 6 కి.మీ. దూరం కాలినడకన అడవిలో వెళ్లి వైద్యం అందించారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కరత్వాడ చెరువు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండి అలుగు పారుతోంది. నీటితో పాటు చేపలు సైతం అలుగు దూకాయి. గమనించిన కరత్వాడ గ్రామస్థులు వలలతో చేపలను పట్టుకున్నారు.
ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ... బొమ్మకల్ గ్రామ శివారులో మహిళా కూలీలు వరి నాటేస్తూ కనిపించారు. అక్కడ ఆగిన ఎమ్మెల్యే ట్రాక్టర్ కూడా దున్నారు. తర్వాత మహిళలతో కలిసి కాసేపు సరదాగా వరి నాటేశారు.
కర్నూలు మండలంలోని సుంకేసుల జలాశయం గేట్ల వద్ద మత్స్యకారులు ప్రమాదకరంగా చేపల వేట సాగిస్తున్నారు. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం నెలకొంది. కొందరు అత్యుత్సాహంగా గేట్లపైకి ఎక్కి వలలు వేస్తున్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శుక్రవారం రాత్రి డ్యాం గేట్లు విద్యుత్ దీపాల వెలుగుల్లో ఇలా తళుకులీనాయి.