చిత్రం చెప్పే విశేషాలు
(28-07-2024)
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అంబర్‌పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
సినీ నటి సంయుక్త హైదరాబాద్‌లోని పంజాగుట్టలో సందడి చేశారు. ఓ ఆభరణాల షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె వివిధ డిజైన్ల నగలను ప్రదర్శిస్తూ.. మగువలకు అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయని తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్‌లో అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరిశీలించారు.
ఉత్తర కాలిఫోర్నియాలో వ్యాపించిన కార్చిచ్చు ‘ది పార్క్‌ఫైర్’ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వాటిని కాల్చిబూడిద చేస్తోంది. కొందరు కావాలని అడవికి నిప్పు పెట్టడంతో కార్చిచ్చు వ్యాపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నల్గొండ జిల్లా శాలిగౌరారంలో పది గ్రామాలు మూసీ ఏటికి అనుసంధానంగా ఉన్నాయి. ఎగువన ఉన్న కొత్తపల్లి చెరువు నిండి అలుగు పారుతోంది. పంట పొలాల మధ్య ఉన్న కొత్తపల్లి చెరువు రహదారి పక్కనే ఉండడంతో వాహనదారులు చెరువు అందాలను వీక్షిస్తున్నారు.
ములుగు జిల్లా వాజేడు మండల పరిధి చీకుపల్లి అటవీ సమీపంలోని బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఛత్తీస్‌గఢ్ అడవులలో కురిసిన భారీ వర్షాలకు జలపాతం అలలు రాతికట్టను బలంగా తాకుతున్నాయి.
దైవ దర్శనంతో భక్తితత్వం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పచ్చదనంతో కూడిన పరిసరాలు శారీరకంగా మానసికంగా ఉత్తేజాన్ని అందిస్తాయి. యాదాద్రి పుణ్యక్షేత్రంలోని పరిసరాలు, రహదారులు పచ్చదనంతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాంలో ఒక పక్క చాలావరకు నీరు లేకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు.. భూమికి పచ్చని తివాచీ పరిచినట్లు పెరిగిన పూలమొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
చుట్టూ పచ్చని కొండలు.. ఒక వైపు ఆకాశంలో మంచు దుప్పటి. మరో వైపు ఎర్రని బురదనీరు.. వడివడిగా గోదావరితో సంగమం కావడానికి పరుగులు తీస్తున్న విశాఖ జిల్లాలోని మత్స్యగెడ్డ చూపరులకు కనువిందు చేస్తోంది. మాచ్‌ఖండ్ జలవిద్యుత్కేంద్రం వించ్‌హౌస్ మార్గం నుంచి కనిపించిన చిత్రమిది
ఆషాఢ మాసం సందర్భంగా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువైన శ్రీకోటసత్తెమ్మ అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. దాతల సహకారంతో వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు.