చిత్రం చెప్పే విశేషాలు
(29-07-2024)
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వద్ద రహదారి పక్కనున్న వేపచెట్టు కొమ్మలను తొలగించగా.. ఇటీవల కురిసిన వర్షాలకు చిగురించి బోన్సాయ్ చెట్టులా కనిపిస్తోంది. కనువిందు చేస్తున్న ఈ చెట్టును ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నల్లమల అడవుల్లో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం సమీపంలోని గుమ్మితం అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండల నుంచి భారీగా నీరు జాలువారుతోంది.
పారిస్ ఒలింపిక్స్‌లో హరియాణా యువతి మను భాకర్ రైఫిల్ షూటింగ్‌లో కాంస్య పతకం సాధించి దేశం తరఫున ఈ ఘనత సాధించిన మొదటి అమ్మాయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో ఆమెను అభినందిస్తూ సైకత శిల్పం తీర్చిదిద్దారు.
విశాఖ జిల్లా మన్యంలో వర్షం కొంతసేపు తెరిపిచ్చిన వెంటనే మంచు అందాలు స్థానికులు, పర్యటకులను మంత్రమగ్ధులను చేస్తున్నాయి. డముకు వ్యూపాయింట్ వద్ద మంచు అందాలు మైమరిపించాయి. ఈ అందాలను పలువురు తమ చరవాణుల్లో బంధించారు.
విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలంలోని రేవుపోలవరం తీరంలో గ్రామానికి చెందిన చింతకాయల బలరాం మరో ఇద్దరు మిత్రులతో కలిసి తీరప్రాంతంలోని జెట్టీ వద్దకు వెళ్లారు. వీరికి కెరటాల మధ్య భారీ మత్స్యం తేలుతూ 10 కేజీల బరువు ఉన్న పండుగప్ప చేప కనిపించింది.
నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో రాక్ గార్డెన్ పేరుతో ఓ ప్రదర్శన కేంద్రాన్ని ఏడాది క్రితం ఏర్పాటు చేశారు. భూమి లోపల పొరల్లో ఉండే వివిధ రకాల రాళ్లతో పాటు, భూమిపైన ఉండే రాళ్లను సేకరించి వాటిపై పేర్లను రాసి విద్యార్థులకు తెలిసేలా ఉంచారు.
కరీంనగర్ జిల్లా బీర్‌పూర్ గుట్టల పైనుంచి వరద నీరు బండలపై పారుతూ కనువిందు చేస్తోంది. పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో బండరాళ్లపై నుంచి వస్తున్న పాలధార జలపాతాలతో పాటు అటవీ ప్రాంతంలోని పచ్చదనాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు వెళ్లే దారిలో నేల బావిపై ఉన్న ఉన్న పచ్చని చెట్టు కొమ్మకు కట్టుకున్న గిజిగాడు పక్షి గూళ్లు బాటసారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాన్ని న్యూస్‌టుడే కెమెరాలో క్లిక్‌మనిపించింది.
నంద్యాల-ప్రకాశం జిల్లాల సరిహద్దులోని శిరువెళ్ల పరిధి చెలిమ రేంజి సమీపంలో పాములా మెలికలు తిరిగినట్లున్న రైలు మార్గంలో ప్రయాణం కొత్త అనుభూతులను పంచుతోంది. ఇక్కడ సొరంగ మార్గంలోనూ రైళ్లు వెళుతాయి.
విశాఖ జిల్లా ఆర్కే బీచ్ సందర్శకులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా పలువురు యువత సముద్రంలోని రాళ్లపైకి చేరి సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపారు. ఒక్కసారిగా బలమైన కెరటం రావడంతో కొందరు కింద పడిపోయారు.
చిటికెలో రంగు మార్చడం ఊసరవెల్లి నైజం. ఇది దానికి ప్రకృతి ఇచ్చిన వరం. ఎక్కడ ఉంటే ఆ రంగును అలంకరించి చూపరులను ఆకట్టుకుంటోంది. పచ్చని మొక్కలు, మామిడి ఆకులపై కదలాడిన ఊసరవెల్లి విశాఖలో ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది.