చిత్రం చెప్పే విశేషాలు
(31-07-2024)
పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో తీర్చిదిద్దిన సైకతం ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలోని వానరానికి నాలుగేళ్ల క్రితం విద్యుదాఘాతంతో కుడి కాలు తెగిపోయింది. ఒంటరిగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండలోని ఆయా కాలనీల్లో సంచరించేది. పుట్టిన పిల్లను ఓ చేత్తో పట్టుకొని.. ఒక కాలు.. ఒక చేత్తో పరుగులు తీస్తోంది.
ఓ లారీపై విమాన శకటాన్ని తీసుకెళ్తున్న దృశ్యం ఒడిశాలోని మునిగుడలో తారసపడింది. ఏ-349 అనే నెంబరుతో ఉన్న దీనిని కోల్‌కతా నుంచి చెన్నైకి తీసుకెళుతున్నట్లు వాహన చోదకుడు తెలిపారు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
ఐడీపీఎల్ చింతల్‌కు చెందిన ఎం.సదానంద్ కాళ్లను చిన్నప్పుడే పోలియో కబళించింది. ఒకరిపై ఆధారపడకుండా ఆయనే స్వశక్తితో ఓ కిరాణ దుకాణం ఏర్పాటుచేసుకొని కుటుంబాన్ని నడిపిస్తున్నారు. తనే ఓ బ్యాటరీ వాహనంపై బేగంబజార్ నుంచి సరకులు తీసుకెళ్తూ ఖైరతాబాద్ వద్ద ఇలా కనిపించారు.
యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగించే యోచనతో దేవస్థానం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా మండపం వేదికపై శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహాలను పొందుపరిచారు. ఈ విగ్రహాలను ఫైబర్ మెటల్‌తో పసిడి వర్ణంలో సిద్ధం చేశారు.
ఒకటే స్తంభం.. వేర్వేరు గడియారాలు.. వేర్వేరు సమయాలు.. నిత్యం వేల సంఖ్యలో ఈ మార్గంలో వెళ్లే హైదరాబాద్ నగరవాసులను తీవ్ర అయోమయానికి గురి చేసున్నాయి. చారిత్రక ఎంజే మార్కెట్ క్లాక్ టవర్ పరిస్థితి ఇది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షూటర్స్ సరబ్‌జోత్ సింగ్, మను బాకర్‌ల జోడి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. వీరిని అభినందిస్తూ బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణ సైకత యానిమేషన్‌ను తీర్చిదిద్దాడు.
పాల వన్నె.. పిలక జుట్టుతో ఆకట్టుకుంటున్న ఈ కొంగను ‘లిటిల్ ఈ గ్రిడ్స్’గా పిలుస్తారు. ఖమ్మం నగరానికి ఆనుకుని ప్రవహించే మున్నేరులో ఇది ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
కర్నూలు నగరం మీదుగా తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత కొన్ని నెలలుగా నీరు లేక వెలవెలబోయిన నది ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. మరోవైపు నదిలో ప్రవాహాన్ని రైలు ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. నది అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఎగువ ప్రాంతం ఆంధ్రా సరిహద్దులో భారీ వర్షాలు కురవడంతో పూర్తిస్థాయిలో ఖమ్మం జిల్లా మధిర చెరువు నిండుకుండలా మారింది. అదనంగా వస్తున్న నీరు పరవళ్లు తొక్కుతూ అలుగు వద్ద మత్తడి పోస్తోంది.
వానాకాలం వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. సూర్యాపేట జిల్లా చందుపట్ల గ్రామంలో వరి నాట్లు వేసే పనులకు వచ్చిన మహిళా కూలీలు అందరు కలిసి పొలం గట్టున కబుర్లు చెప్పుకుంటూ.. మధ్యాహ్న భోజనం చేస్తూ ఇలా ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కారు.