చిత్రం చెప్పే విశేషాలు
(01-08-2024)
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని అనూరాధ ఓ రావి ఆకుపై పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించిన మనుబాకర్.. చిత్రాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నారు.
పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో నెమలి పురివిప్పి నాట్యం చేయడం అందరిని కనువిందు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పురపాలిక పరిధిలోని కావేరమ్మపేట నుంచి శిఖర్‌గాన్‌పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఓ రైతు పొలంలో పురివిప్పిన నెమలి చూపరులను ఆకట్టుకుంది.
కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్‌కు చెందిన కూర పురుషోత్తం అనే జాలరి లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)లో చేపలు పట్టారు. ఆయన వలకు 30 కిలోల బొచ్చె చేప చిక్కింది.
మూడేళ్ల విరామం తర్వాత కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నాగార్జునసాగర్‌లో చేరడంతో రెండు రోజుల్లోనే కృష్ణా వెనుక జలాలు నల్గొండ జిల్లాలోని వైజాగ్‌కాలనీ సమీపంలో కిలోమీటరు మేర పెరిగాయి.
ఏటా వర్షాకాలంలో పూసే రాఖీ పుష్పం రక్షాబంధన్ పండగకు ముందే వికసించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ శివాలయం ప్రాంగణంలో తీగకు పూసిన ఆ రాఖీ పూలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.
తుంగభద్రకు భారీగా వరద వస్తుండటంతో కర్ణాటకలోని హొసపేటె వద్దనున్న జలాశయం 33 గేట్లనూ ఎత్తి 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1631 అడుగుల నీటిమట్టం ఉంది.
ఇందూరు నయాగరాగా ప్రసిద్ధి చెందిన సిర్నాపల్లి జానకీబాయి అలుగు.. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం సిర్నాపల్లిలో ఉంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువు నిండటంతో 40 అడుగుల ఎత్తు నుంచి అలుగు దూకుతూ పర్యటకులను ఆకర్షిస్తోంది.
గల్లీల్లో గస్తీ నిర్వహణకు పోలీసులు సైకిళ్లను వినియోగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ గస్తీ నిర్వహించారు.
పచ్చని అందాలను సింగారించుకుని ఆహ్లాదం పంచుతున్న ఈ ప్రాంతం.. హైదరాబాద్ నగర శివారులోని ప్రతిపాదిత నైపుణ్య విశ్వవిద్యాలయానికి వెళ్లే రహదారిపై ఉంది. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి నుంచి మీర్‌ఖాన్‌పేట్ పెద్దమ్మగుడి వరకు రోడ్డును ఇలా రంగురంగుల పూల మొక్కలతో తీర్చిదిద్దారు.
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు తెరిపివ్వడంతో చిన్నారులంతా ఖాళీస్థలాల్లో ఇలా సందడి చేస్తున్నారు. అశ్వారావుపేట శివయ్య వీధిలో చిన్నారులు సరదా ఆడుతున్న ఈ సైకిల్ ఆట చూడముచ్చటగా ఉంది. ఆ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది.