చిత్రం చెప్పే విశేషాలు

(02-08-2024)

ఆదిలాబాద్‌కు 25 కిలో మీటర్లు దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో లోయల మధ్య జాలువారుతున్న జలపాతాలివి. కొండా కోనల్లో ఎత్తు నుంచి కిందకు దూకుతూ కనువిందు చేస్తున్నాయి. బండరాళ్ల నడుమ లోయల్లో నడుస్తూ వెళ్తే ఈ జలపాతాలు కనిపిస్తాయి.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వరస్వామి కొండ వద్ద పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్‌ మనుబాకర్‌కు సైకతశిల్పం ద్వారా శిల్పి గేదెల హరికృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. 

ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో రెండు రోజులుగా మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ మత్స్యకారుడు గొడ్ల నాగబాబు వలకు 20కిలోల భారీ వాలుగ చేప చిక్కింది. ఆ చేపను గ్రామాల ప్రజలు, మత్స్యకారులు ఆసక్తిగా తిలకించారు.  

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల పశువైద్యశాలలోని బీరువాలో ఓ నల్ల తాచుపాము హల్‌చల్‌ చేసింది. సమాచారం అందుకున్న స్నేక్‌క్యాచర్‌ జంపన గణేష్‌వర్మ వచ్చి నల్లతాచును పట్టుకుని ప్లాస్టిక్‌ డబ్బాలో బంధించారు.

సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం గొల్లపల్లికి చెందిన రైతు బాల్‌ నర్యయ్య ప్రత్యేకంగా ఆలోచన చేసి రూ.44 వేలు ఖర్చు చేసి టైర్లతో కూడిన ఎడ్ల బండి తయారు చేసుకున్నారు. పత్తి, నీళ్ల డబ్బాలు, గడ్డి మోపులను తీసుకెళ్తుంటారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సమీపంలోని రామవరంలో గోధుమ వాగు మీదుగా ఎక్స్‌ట్రా హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ వెళ్తోంది. దీనికి సంబంధించిన ఓ టవర్‌ను వాగు మధ్య నాలుగు పిల్లర్లపై నిలబెట్టారు. వర్షాకాలంలో వాగు ఉద్ధృతిని తట్టుకుని ఉండేలా పిల్లర్లను దృఢంగా నిర్మించారు.

ఎర్రకాలువ వరద ఉధ్ధృతికి తాడేపల్లిగూడెం మండలంలోని వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. వరదనీటితో నిండిన వరిపొలాలు, వరినాట్లు వేయడంతో పచ్చగా కళకళలాడుతున్న చిత్రాలు తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో కనిపించాయి.

సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఏస్గి గ్రామానికి చెందిన రైతు రాజుకు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సోయా, కంది పంటలు వేశారు. కలుపు పెరగడంతో కూలీల ఖర్చు కలిసి వస్తుందని నలుగురితో కలిసి ఐదు సాళ్లు ఏకకాలంలో దంతె పట్టేలా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ శిరస్త్రాణం.. ఆదిలాబాద్‌ జిల్లా అన్నదాతలకు రక్షణంగా ఉంటోంది. గతంలో చాలా మంది రైతులు పురుగు మందులు పిచికారీ చేసే సమయాల్లో ముక్కు, నోట్లోకి ముందు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గుర్తించిన రైతులంతా పురుగు మందు పిచికారీ వేళల్లో వీటిని వాడుతూ జాగ్రత్త పడుతున్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home