చిత్రం చెప్పే విశేషాలు

(03-08-2024)

తమిళనాడు రాష్ట్రం నామక్కల్‌ జిల్లా కొల్లిమలైలో వల్వియల్‌ ఓరి ఉత్సవం కోలాహలంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శన సందర్శకులకు కనువిందు చేసింది. పుష్పాలతో చేసిన చేప, సీతాకోకచిలుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భారత సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, రాష్ట్ర విపత్తు దళాలు, స్వచ్ఛంద సేవా సంస్థ సేవాభారతిలు ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే చేపట్టాల్సిన సహాయక చర్యలపై ‘ఎక్సర్‌సైజ్‌ రాహత్‌’ను హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని హుస్సేన్‌ సాగర్‌ వ్యూపాయింట్‌ వద్ద నిర్వహించాయి.

సాధారణంగా పుట్టగొడుగులు గుండ్రంగా, ముదిరితే పువ్వుల్లా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా పుట్టగొడుగు పురివిప్పిన అల్లికలా ఆకట్టుకుంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని కంపుమానుపాకలులో భూపతి కాఫీతోటలో ఇది కనిపించింది. 

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం మహదుపటేల్‌ గ్రామస్థులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలంటే వర్షాకాలంలో సాహసం చేయాల్సిందే. ఉద్ధృతంగా ప్రవహించే వాగు దాటితేనే జీవనం సాగేది. ఉదయం, సాయంత్రం పిల్లలను భుజాలపై కూర్చోబెట్టుకొని వాగు దాటించి బడికి పంపాల్సిందే.  

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టులో ఇప్పటికే ఓ బెర్త్‌ పూర్తికాగా- మరో మూడు బెర్త్‌ల పనులు జరుగుతున్నాయి. ఆ క్రమంలో రాత్రి పగలు డ్రెజ్జింగ్‌ పనులు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలపైన ఈ ఓడ ఆ పనుల్లో నిమగ్నమై కనిపించింది.

అరుదుగా లభించే గెలస్కోప్‌ చేప సీలేరు నదిలో మత్స్యకారుల వలకు చిక్కింది. సీతారామరాజు జిల్లాలోని సీలేరుకు చెందిన మత్స్యకారుడు బంగారుశెట్టి.. మంగంపాడు వద్ద వలలు వేయడంతో సుమారు 15 కిలోల చేప పడింది. 

 కాకతీయుల వరప్రదాయిని లక్నవరం జలాశయం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఉన్న ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. దీంతో ఇక్కడి వేలాడే వంతెనల పైనుంచి సరస్సు అందాలను తిలకించేందుకు పర్యటకులు తరలివస్తున్నారు.

ఆదిలాబాద్‌: చుట్టూ పచ్చదనం. అక్కడక్కడ మరింత సొబగులద్దేలా పూల సోయగం.. ఎత్తయిన కొండలు.. ఊటీని తలపించే కొండవాలు పచ్చికబయళ్లు.. ఖండాలా ప్రాంతంలా కనువిందు చేస్తున్న దృశ్యాలివి. వర్షాలతో అడవి మొత్తం పచ్చదనం సంతరించుకుంది.

వర్షాలు సరిగ్గా కురవక కరీంనగర్‌ జిల్లా ఎల్‌ఎండీ జలాశయంలో పూర్తి స్థాయి నీరు లేదు. దీంతో చిన్న చిన్న మడుగుల్లో నత్తలు, చేపల వేటకు నిత్యం కొంగలు గుంపుగా వచ్చి ఆ జీవులను తింటూ కడుపు నింపుకొంటున్నాయి. అక్కడే కాసేపు సేద తీరుతున్నాయి.

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జార్జి ఇంజినీరింగ్‌ కళాశాలలోకి ఊహించని అతిథి వచ్చింది. అరుదైన జీవుల్లో ఒకటైన (అలుగు) పంగోలిన్‌ అనే జంతువు కళాశాలలోని విద్యార్థినుల వసతిగృహ ఆవరణలో సంచరిస్తుండగా వారు గుర్తించారు.

వినాయక చవితి పర్వదినం.. కొలువుదీరిన బొజ్జగణపయ్య!

మీ జీవితం విలువను గుర్తించండి

చిత్రం చెప్పే విశేషాలు (06-09-2024)

Eenadu.net Home