చిత్రం చెప్పే విశేషాలు

(05-08-2024)

ఈ అవ్వ హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ అంగడికొచ్చింది. అక్కడి దారిలో పురాతన నాణెం కనిపించింది. ఒక్కసారి చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి..మనసారా చూసుకొని మురిసిపోయింది.

సహజంగా నదిలో పడవలపై చేపల వేట సాగిస్తుండటం చూస్తుంటాం. గోదావరి వరదల నేపథ్యంలో శుభ్రమైన తాగునీటి కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో జాలర్లు ఇలా పడవలపై శబరి నది మధ్య వరకు వెళ్లి నీటిని బిందెలతో సేకరిస్తున్నారు. 

కర్ణాటక గుండ్లుపేట తాలూకా బండీపుర పులుల అభయారణ్యంలో ధ్రువ్‌ పాటిల్‌ అనే ఛాయా చిత్రగ్రాహకుడు అరుదైన నేత్రాలున్న చిరుత ఫొటో తీశారు. దాని ఎడమ కన్ను ముదురు గోధుమ రంగులో, కుడి కన్ను నీలం, లేత ఆకుపచ్చ వర్ణంలో ఉన్నాయి. 

సెంటీమీటర్‌ పరిమాణంతో కనిపిస్తున్న ఈ సాలీడు శాస్త్రీయనామం టెలమోనియా డిమిడియేట. వేటలో దూకుడు ప్రదర్శించే ఈ బుల్లి సాలీడుకు ఎనిమిది కళ్లుంటాయి. రెండు కళ్లు పెద్దవి కాగా మిగతావి చిన్నవి. అసెంబ్లీ వద్ద లాన్స్‌లో ఈ సాలీడు ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.

హైదరాబాద్‌ గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా వసుమతి వేదం ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో 16 మంది కళాకారులు నాట్యహారతి నిర్వహించారు. కోటలోని 355 మెట్లపై పేరిణి, కూచిపూడి నృత్యం చేస్తూ అమ్మవారి చెంతకు చేరారు.

విశాఖ జిల్లా మన్యంలో ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. సహజసిద్ధ అందాలకు నెలవైన డల్లాపల్లి పరిసరాల్లో కొండల నడుమ రమణీయమైన దృశ్యాలు, మెట్ల రూపంలో ఉన్న పచ్చని పంట పొలాలు పర్యటకులను మైమరిపించాయి.

పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొర్లి పొంగుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో నుంచి వస్తున్న ప్రవాహంతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని గోకాక్‌ జలపాతం నురగలు కక్కుతూ కిందకి దూకుతున్న దృశ్యం చూపరులను కట్టిపడేసింది. 

అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ నిర్వహణలో కొనసాగుతున్న ఉద్యానాలు.. వానాకాలం నేపథ్యంలో పచ్చందాలతో ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. హరితంతో కూడిన పరిసరాల మధ్య సేదతీరేందుకు సందర్శకులు కూడా భారీగా తరలివస్తున్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home