చిత్రం చెప్పే విశేషాలు
(12-08-2024)
విక్రమ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘తంగలాన్’. మాళవిక మోహనన్ కథానాయిక. హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా ఇది సిద్ధమైంది. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం తాజాగా విజయవాడలో సందడి చేసింది.
శ్రీరామ నవమికి గోటి తలంబ్రాలను అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్ట వంటి విశిష్ట రామాలయాల్లో సమర్పించేందుకు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో రామభక్తులు భక్తిశ్రద్ధలతో వరినాట్లు వేశారు.
విశ్వ క్రీడా సంబరం ముగిసింది. పారిస్ వేదికగా గత 19 రోజులుగా జరిగిన ఒలింపిక్స్ వేడుకలు సమాప్తమయ్యాయి. ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్ ముగింపు వేడుకలను సైతం ఘనంగా నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని పర్యటక ప్రాంతాలకు దూరప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో బసచేసిన పర్యటకులు ఉదయాన్నే చెరువులవెనం కొండపైకి వెళ్లి అక్కడ మంచు అందాలతోపాటు సూర్యోదయాన్ని ఆస్వాదించారు.
ఈ రోజు ఆదివారం.. కార్యాలయానికి ఎవరూ రారు.. ఇక మనదే రాజ్యం అనుకుని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సర్కిల్ కార్యాలయం వద్ద రెండు ఉడతలు సరదాగా బయటకు వచ్చాయి. మెల్లిగా ఆగి ఉన్న బండి కిందకు చేరాయి.
వరంగల్ జిల్లా హనుమకొండ సమీపంలోని పలివేల్పుల వద్ద ఈ దృశ్యం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది. వివిధ రకాల కారణాలతో పిచ్చుకలు అంతరించి పోతున్నాయి. అలాంటిది ఒకేచోట వందల సంఖ్యలో పిచ్చుకలు ఇలా తీగలపై తోరణంలా కనిపించి కనువిందు చేశాయి.
సముద్రంలా కనుచూపు మేర కనిపిస్తున్నవన్నీ సౌర విద్యుత్తు ఫలకలు. అన్నమయ్య జిల్లా గాలివీడు తూముకుంట సమీపంలో వెలిగల్లు జలాశయాన్ని ఆనుకుని వివిధ కంపెనీలు వీటిని 6 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశాయి. ఇక్కడ దాదాపు 400 మెగావాట్ల మేర విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది.
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే మార్గంలో భూపతిపాలెం జలాశయం, కొండవాగుల వద్ద ఉన్న పచ్చని కొండలు పొగమంచుతో, అవే దృశ్యాలు నీటిలో ప్రతిబింబాలుగా కనిపిస్తుండడంతో పర్యటకులు ఆకర్షితులయ్యారు.
విశాఖ బీచ్‌రోడ్డు పర్యాటకులతో కిక్కిరిసింది. ఎక్కడ చూసినా జన సందోహమే కనిపించింది. సముద్ర అలల్లో కేరింతలు కొడుతూ సందడి చేశారు. యువత తీరంలోని రాళ్లపై కూర్చొని చిత్రాలు దిగారు. బీచ్‌రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది
2021 డిసెంబరులో ఎటు చూసినా మట్టిగుట్టలతో కనిపించిన ప్రదేశం నేడు.. సిమెంటు తాపడం, సీసీ రహదారులు, అందమైన లైట్లతో మనోహరంగా మారింది. ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ ఎత్తి పోతల పథకం పంపుహౌస్ వద్ద కనువిందు చేసిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది.