చిత్రం చెప్పే విశేషాలు

(19-08-2024)

రెక్కాడితేనేగానీ డొక్కాడని జీవితాలు వారివి. బిడ్డ ఆకలితీర్చిన అమ్మ కొమ్మనే అమ్మగా చేసి నిద్రపుచ్చింది. తర్వాత తన ఆకలి తీర్చుకోవడానికి ఉపక్రమించింది. కడప జిల్లా రాజంపేటలో ఇంటి పని కోసం వచ్చిన మహిళా కార్మికురాలు భోజన విరామ సమయంలో ఇలా కన్పించింది.

పచ్చదనం అలుముకున్న వేళ పక్షి దళం మురుస్తోంది. చిరుజల్లులను ఆస్వాదిస్తోంది. ప్రకృతితో మమేకమవుతోంది. గోదావరి తీరంలో ఓ గుడిసె వద్ద ఓ రామచిలక ఇలా మొక్కజొన్న కండెను ఒడుపుగా ఒలుచుకుంటూ గింజలు తింటోంది. ‘ఈనాడు’ కెమెరాకు ఇలా చిక్కింది. 

హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంకు జేఏన్టీయూ ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు తయారు చేసిన విగ్రహాలు చిరుదరహాసంతో ఉన్నాయి. ఆ పక్కనే పనులు చేసి అలసిపోయిన కార్మికురాలు ఆ విగ్రహం పక్కనే కాసేపు సేద తీరిన సమయంలో తీసిన చిత్రమిది 

సంధ్యా సమయాన, నీలాకాశంలో వందల సంఖ్యలో చిన్న గువ్వలు ఇలా ఎగురుతుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అనంతపురం నగర సమీపాన బుక్కరాయసముద్రం వద్ద ఇవి కనువిందు చేశాయి.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్‌ హార్బర్‌కు భారీ టేకు చేప వచ్చింది. కాకినాడకు చెందిన మత్స్యకారులు అంతర్వేది సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లగా ఈ భారీ టేకు చేప వలకు చిక్కింది. 30మంది తాళ్ల సాయంతో నీటిలోనుంచి పైకి లేపడానికి ప్రయత్నించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ సమీపంలో నిర్మించిన నూతన సచివాలయ భవనం, తెలంగాణ అమరుల స్మారక స్తూపాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. స్మారక చిహ్నంలోని అద్దాల నిర్మాణంలో సచివాలయ భవనం, పరిసరాలు ఇలా ప్రతిబింబిస్తూ అలరిస్తున్నాయి. 

దూరం నుంచి చూస్తే మెలికలు తిరిగి పాకుతున్న పాములా కనిపిస్తోంది కదూ. ఇది ప్రకృతి మలుపుల్లో ముందుకు సాగుతున్న రైలుబండి. వికారాబాద్‌ అనంతగిరి అడవులు. పచ్చటి కొండల మధ్య మెలికలు తిరుగుతూ వెళ్తున్న గూడ్స్‌ బండిని ‘ఈనాడు’ తన కెమెరాలో బంధించింది. 

శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి జిల్లాలోని శేషాచలం అటవీప్రాంతం అరుదైన జంతుజాలం, క్రిమి, కీటకాలకు ఆవాసం. అటవీ ప్రాంతంలో అరుదైన రంగుల్లోని ఓ పెద్ద సాలీడు ఆకట్టుకుంటోంది. ఇది తూర్పు, దక్షిణ ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

శ్వాసించే ప్రతి ప్రాణిదీ బతుకు పోరాటమే. చిన్న జీవిని పెద్దది తినే ఆహార గొలుసు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంటుంది. కాకినాడ సముద్ర తీరంలో చేపను పీత ఇలా వేటాడింది.

పక్షుల్లో సివిల్‌ ఇంజినీరుగా భావించే గిజిగాడు తన పిల్లలను, తనను రక్షించుకోవడానికి చెట్లు కొమ్మల చివర్లలో గూడు కడుతుంది. అసలే ఆకాశాన్నంటే కొబ్బరిచెట్టు... కొబ్బరాకుల చివర్లో కట్టుకున్న గూళ్లు గిజిగాడి కాలనీని తలపిస్తున్నాయి. కడపలోని చిట్వేల్‌ సమీపంలో కన్పించిన దృశ్యమిది. 

రాజసంతో నడిచొచ్చే పులి.. ప్రకృతి అందాల రమణీయత..గోదావరిపై వంతెనల మధ్య సాయంవేళ విహారం.. వీటిని ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి కొండ, పల్లం దీవి తదితర ప్రకృతి అందాలను డ్రోన్‌లతో చిత్రాలుగా నిక్షిప్తం చేశారు. 

చిత్రం చెప్పే విశేషాలు(11-09-2024/1)

మీతో మీరు పోటీ పడండి

చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

Eenadu.net Home