చిత్రం చెప్పే విశేషాలు
(22-08-2024)
ప్రముఖ నటుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ.. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే దంపతులు వారికి ఘనస్వాగతం పలికారు. పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి కేక్ కట్ చేసి.. సురేఖతోపాటు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు.
సాయంత్రం సంధ్యా సమయంలో వర్షం కురుస్తుండగా.. హైదరాబాద్‌లోని హస్సేన్‌సాగర్ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో బుద్ధుడు కనిపించాడు ఇలా..
కొన్నేళ్లుగా మూతపడిన మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి మహావృక్షం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. చెట్టు పరిసర ప్రాంతంలో ఏర్పాటుచేసిన ధ్యానముద్రలోని బుద్ధుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరంలో మినీ ట్రాక్టర్ ఒకరు నడుపుతుండగా వెనుక నాగళ్లపై ఇద్దరు రైతులు భుజాన స్ప్రేయర్లతో కూర్చొని పొలం పనులకు వెళుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి కొండలు వర్షాకాలంలో పచ్చటి వాతావరణంతో కనుచూపు మేర కనువిందు చేస్తున్నాయి. అనంతగిరి వ్యూ ప్యాయింట్ నుంచి చూస్తే చుట్టూ వృక్షాలు, నల్లరేగడి నేలల్లో పెరుగుతున్న పైర్లు ఇలా ఎంతో ఆకర్షణీయంగా ఆకట్టుకుంటున్నాయి.
గజపతి జిల్లా రాయగడ సమితిలోని గండహతికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం ఏజెన్సీలో గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తుండడంతో నీరు చేరి పర్యాటకులను కనువిందు చేస్తోంది. చిన్నా, పెద్దా అంతా చేరి జలకాలాడుతూ సందడి చేస్తున్నారు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ మాల్‌లో డైనోసర్ల ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. మాల్ కింది అంతస్తులో పిల్లలు, పెద్దలను ఆకర్షించేలా ఏర్పాటు చేసిన సెట్‌లో 10 రకాల డైనోసర్లు కదులుతూ, అరుస్తున్నట్లు తీర్చిదిద్దారు.
చుట్టూ కనుచూపు మేర ఆకుపచ్చని అభయారణ్యం.. ఎత్తయిన కొండలు.. వాటి సమీపాన అక్కడక్కడా చెరువులు.. సుందరమైన ఈ దృశ్యాలు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కనిపించాయి.
నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్‌కాలనీ సమీపంలోని తుల్చిసాద్ దేవాలయం ఇది. ఓవైపు నల్లమల అటవీ ప్రాంతం..మరో పక్క కృష్ణా జలాలతో ద్వీపకల్పంలా తలపిస్తున్న ఈ ఆలయం ఇక్కడి ప్రజలకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచుతోంది.
పశ్చిమబెంగాల్‌లోని శిలీగుడీలో స్వర్ణ శోభితంగా మారి హిమాలయ పర్వత శ్రేణిలోని కాంచన్‌జంగా ప్రాంతం కనువిందు చేస్తూ కనిపించిందిలా..
తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పున్నమి చంద్రుడు ఆకట్టుకుంటున్నాడు. ఆలయంపై, గరుత్మంతునిపై, శ్రీవారి శంఖుచక్రాలు, తిరునామం మధ్యలో, గోపురాలపైన ప్రకాశిస్తూ కనిపించాడిలా..