చిత్రం చెప్పే విశేషాలు

(24-08-2024)

వాన రాకను సూచిస్తూ కూత పెట్టే ఈ చాతక పక్షి రైతులకు ఎంతో ఇష్టమైనది. వానాకాలంలోనే కన్పించే కోయిల జాతికి చెందిన ఈ పక్షిని ‘వానకోయిల’గా పిలుస్తారు. ఇది వర్షపు చినుకులను నేరుగా తాగుతుంది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లు జలాశయం వద్ద కన్పించింది.

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ‘‘ది మిస్టికల్‌ వింగ్స్‌ అండ్‌ ఎటర్నల్‌ టింకెల్స్‌’’ పేరిట చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చిత్రకారిణి ఆశారాధిక తన మదిలో మెదిలిన భావాలను కాన్వాస్‌పై చూడముచ్చటగా ఆవిష్కరించిన తీరు కళాభిమానులను ఆకట్టుకుంటుంది. 

ఐస్‌ల్యాండ్‌లో మరోసారి అగ్నిపర్వత విస్ఫోటం జరిగింది. గత డిసెంబరు నుంచి అగ్నిపర్వత విస్ఫోటం జరగడం ఇది ఆరోసారి. రెక్జానెస్‌ ద్వీపకల్పంలో జరిగిన ఈ విస్ఫోటం తీవ్రత సాధారణ స్థాయిలో ఉన్నట్లు తెలియడంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు ఆ దృశ్యాలను వీక్షించడానికి పోటెత్తారు. 

తిరుపతి-పీలేరు మార్గం భాకరాపేట వద్ద వినీలాకాశంలో సంచరిస్తున్న నీటికాకులు యుద్ధ విమానాలను తలపించాయి. ఇటువైపుగా వెళ్లే జనాలు, యాత్రికులు కనువిందు చేస్తున్న పక్షుల గుంపును ఆసక్తిగా తిలకించారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో దేశవిదేశాల నుంచి విచ్చేసే భక్తులకు.. తిరుపతి ప్రజలకు దాహార్తి తీర్చే కల్యాణి డ్యాంలో నీటిమట్టం భారీగా తగ్గింది. వంద అడుగుల సామర్థ్యం కలిగిన జలాశయం ప్రస్తుతం 46 అడుగులకు పడిపోయింది. తీవ్ర వర్షాభావం కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.

నిజామాబాద్‌ శివారులోని అశోక్‌సాగర్, అలీసాగర్‌ వద్ద ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకోవడంతో పాటు పచ్చదనం పరుచుకొని కనువిందు చేస్తున్నాయి. 

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఐదు రోడ్ల కూడలిలోని శ్రీ బాల వినాయక ఆలయంలో సంకష్టహర చతుర్ధిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఆలయంలో దీపాలతో తీర్చిదిద్దిన బాల గణపతి ఆకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 

 పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు శాటిలైట్, రాకెట్, స్పేస్‌ స్టేషన్‌ నమూనాలు తయారుచేసి ప్రదర్శించారు.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని వీరన్నపల్లి సమీపంలో ఉన్న పుల్లేటి వాగు రహదారి వర్షాలకు కోతకు గురై రాకపోకలు స్తంభించాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బాతులు కరీంనగర్‌ దిగువ మానేరు తీరంలో సేద తీరుతున్నాయి. వాటి యజమానులు ఎక్కడ జలాశయాలు కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటూ సంచార జీవనం సాగిస్తున్నారు. కరీంనగర్‌ మానేరు జలాశయానికి తీసుకొచ్చిన బాతులు ఇవి. 

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

Eenadu.net Home