చిత్రం చెప్పే విశేషాలు

(26-08-2024)

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా సైకత యానిమేషన్‌ను తీర్చిదిద్దాడు. బాలకృష్ణుడు, పిల్లనగ్రోవి తదితర ఆకృతులు తీర్చిదిద్ది, ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశాడు.

నల్గొండ జిల్లాలోని మూసీ జలాశయంలో నీరు సమృద్ధిగా చేరడంతో ఇటీవల మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో మూసీలో నీరు చేరగా.. నిండుకుండలా కనిపిస్తోంది. దిగువకు విడుదల అవుతున్న నీటిలో కొందరు వల వేసి చేపలు పట్టారు. 

 శ్రీ కృష్ణాష్టమిని సందర్భంగా అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకకు చెందిన హస్త కళాకారిణి చింతల లావణ్య అరంగుళం సైజ్‌లో లక్కతో కృష్ణుడి బొమ్మ తయారు చేశారు. దీని తయారీకి రెండు రోజుల సమయం పట్టినట్లు ఆమె వివరించారు. 

విశాఖలోని రుషికొండ బీచ్‌ పరిసరాల్లోని సాగర జలాల్లో పలువురు యువకులు చేసిన సర్ఫింగ్‌ విన్యాసాలు చూపరుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్ఫింగ్‌ నిపుణుడు అనుదీప్‌ నేతృత్వంలో రాయితి రాము, చుక్కా అప్పలరెడ్డి తదితరులు సాధనలో భాగంగా కెరటాలతో పోటీపడే రీతిలో విన్యాసాలు ప్రదర్శించారు. 

కృష్ణానది అంచున మడిలో వరినాట్లు వేస్తుంటే నదిలోనే వేస్తున్నట్లు ఈ చిత్రం చూపరులను కనువిందు చేస్తుంది. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని కాచరాజుపల్లి గ్రామంలో ఇలా కూలీలు సైతం చక్కని వాతావరణంలో ఉల్లాసంగా నాట్లు వేస్తుండగా..‘ న్యూస్‌టుడే’ కెమెరా క్లిక్‌మనిపించింది. 

వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ సమీపంలో ఒంపులు తిరిగిన కాగ్నా నది.. ఆ పక్కనే పరిశోధనా స్థానం విస్తరించి.. పచ్చని పంటలతో అలరారుతోంది. ఆ మార్గంలో ప్రయాణించే వారు ఈ ఆహ్లాద ప్రాంతాన్ని చూసి మైమరిచిపోతున్నారు. డ్రోన్‌ కెమెరాతో తీసిన ఈ చిత్రం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది.

ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం చుట్టుపక్కల గ్రామాల్లో ఎర్ర చెలక నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ భూముల్లో మెట్ట పంటలు విస్తారంగా పండుతాయి. వర్షాలకు ఓ వైపు పత్తి ఏపుగా పెరుగుతుండగా.. ఇంకోవైపు మిరప నారు వేసేందుకు దుక్కిని సిద్ధం చేసిన దృశ్యమిది.

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం రొంపుల కొండదారిలో పచ్చని కొండలపై పాలనురగల్లా తేలియాడుతున్న మంచు సోయగాలు మైమరపించాయి. చింతపల్లి, కేడీపేట మధ్య ఉన్న ఈ కొండలపై మంచు అందాలు ఆకట్టుకున్నాయి. 

శ్రీ కృష్ణాష్టమిని సందర్భంగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నీస్‌బుక్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ గట్టెం వెంకటేష్‌ పెన్సిల్‌ ముల్లుపై బాలకృష్ణుడి చిత్రాన్ని మలిచారు. 6 గంటల సమయంలో 8 మి.మి. పొడవు, 14 మి.మి. వెడల్పుతో దీన్ని తయారు చేశారు. 

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి వెళ్లే దారిలో రోడ్డు వెంట ఓ ఈత చెట్టుకు ఎంతో ఆకర్షణీయంగా ఉన్న గిజిగాడి గూళ్లను ‘న్యూస్‌టుడే’ కెమెరా క్లిక్‌మనిపించింది.

చిత్రం చెప్పే విశేషాలు(11-09-2024/1)

మీతో మీరు పోటీ పడండి

చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

Eenadu.net Home