చిత్రం చెప్పే విశేషాలు

(28-08-2024)

ఆకాశం ఎరుపెక్కిన ఈ దృశ్యం సాయంత్రం అనకాపల్లి జిల్లా పరవాడలో కనిపించింది. నలువైపులా ఎర్రని చారలు పరచుకోవడంతో ప్రజలు ఆశ్చర్యంతో తిలకించారు. ఈ దృశ్యాన్ని పలువురు కెమెరాల్లో బంధించారు. 

ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు వైట్‌బ్రౌడ్‌ ఫ్యాన్‌టేల్‌ ఫ్లైక్యాచర్‌. నీటి కుంట వద్దకు చేరుకొని తన ప్రతిబింబాన్ని అందులో చూసుకొని మురిసిపోతోంది. ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని గనిశెట్టికుంట అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కింది.

సాయంసంధ్య వేళ... సూర్యకిరణాల కాంతి.. ఎన్టీఆర్‌ అమరావతి జిల్లాలోని కృష్ణా నదిపై పడిన సమయంలో బంగారు వర్ణంలో మెరుస్తున్నఈ కమనీయ చిత్రం చూపరులను కనువిందు చేసింది. 

కరీంనగర్‌ జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో హరివిల్లు కనువిందు చేసింది. సాయంత్రం వేళ ఓ వైపు ఎండ కాస్తుండగా, మరో వైపు మేఘావృతమై చినుకులు పడగా ఇంద్రధనస్సు ఏర్పడి అబ్బురపరిచింది. 

చుట్టూ గుట్టలు, చెట్లతో పరచుకున్న పచ్చదనం.. మధ్యలో నీళ్లు.. అందులో ఏకశిల. ఈ ప్రకృతి సౌందర్య దృశ్యం కనులకు నాట్యం నేర్పేలా కనిపిస్తుంది. ఈ చిత్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్‌టెక్స్‌లో సాక్షాత్కరిస్తుంది. 

ఆకాశంలో రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్లు ఉన్న ఈ దృశ్యం వరంగల్‌- ఖమ్మం జాతీయ రహదారిలోని నాయుడు పెట్రోల్‌ పంపు కూడలిలోనిది. నగర అభివృద్ధిలో భాగంగా హైమాస్ట్‌ లైట్‌ చుట్టూ ఇలా అందమైన సీతాకోక చిలుకల బొమ్మలు విహరిస్తున్నట్లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో ఒంటి కాలితో సైక్లింగ్‌ సాధన చేస్తున్న ఈ యువకుడి పేరు ఆర్యవర్ధన్‌. రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసిన యువకుడు ఏదైనా సాధించాలన్న తపనతో సైక్లింగ్‌వైపు మళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏసియన్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌ ట్రాక్‌లో రెండు రజత పతకాలు సాధించారు.  

 రాష్ట్రంలోని అతిపెద్ద జలాశయాల్లో రెండోదైన ‘సూపా’ కొత్త నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఉత్తర కన్నడ జిల్లా జోయిడా సమీపంలోని ఈ జలాశయానికి వరద పోటెత్తుతుండటంతో మంగళవారం గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యమిది.

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(10-12-2024)

Eenadu.net Home