చిత్రం చెప్పే విశేషాలు
(12 -10-24)
విజయవాడ.. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. విజయ దశమి, ఉత్సవాల చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన గౌర అభిలాష్ సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు దసరా సందర్భంగా కనకదుర్గమ్మ బొమ్మను గీసి ప్రదర్శించాడు.
హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా ఎల్‌బీనగర్ కామినేని వంతెనకు కళాకారులు పక్షుల బొమ్మలు గీస్తున్నారు. తమవద్ద ఉన్న చిత్రాల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చిత్రీకరిస్తుండటంతో సహజత్వం ఉట్టిపడుతూ ఆకట్టుకుంటున్నాయి.
తిరుమలలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం పుష్కరిణిలో అర్చకులు ఈ క్రతువును పూర్తిచేశారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
మిల్టన్ తుపాను ఉద్ధృతికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం అతలాకుతలమైంది. గురువారం సంభవించిన బలమైన సుడిగాలుల (టొర్నడో) ధాటికి అక్కడి తీర ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించింది. అనేక ఇళ్లు నేలమట్టమవ్వగా, వీధులన్నీ బురదతో నిండిపోయాయి.
ఆదిలాబాద్‌లోని టీచర్స్ కాలనీలోని సాయిబాబా మందిరం సమీపంలో ప్రతిష్ఠించిన శారదామాత ప్రతిమ వద్ద దీపాల అలంకరణ
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గా మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారి అష్టోత్తరాలు పఠించారు. కొలువుదీరిన దుర్గాదేవి మండపాల్లో నిర్వాహకులు అన్నదానాలు చేశారు.
ర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లులో ‘యువ’ విన్యాసాలు అలరిస్తాయి. కత్తులపై పడుకొని బండలు పగులకొట్టడం.. నోటితో వాహనాలను లాగడం.. ఇనుప చువ్వలు గుచ్చుకొని వాహనాలను లాగడం.. ఎద్దుల బండ్లను జుట్టుకు కట్టుకొని తీసుకెళ్లడం వంటి ఒళ్లు గగుర్పొడిచే సాహసాలతో ఆకట్టుకుంటారు.
ప్రకృతి అందాలకు నిలయమైన మన్యం జిల్లా పచ్చని అందాలతో మెరిసిపోతోంది. దట్టమైన అడవులు.. గిరిజనులు సాగు చేసిన పంట పొలాలు.. వాటి మధ్య ప్రవహిస్తున్న కాలువలు.. ఇలా పచ్చని అందాల మధ్య ఉన్న గిరిజన గ్రామాలు ప్రకృతి ప్రియులను ఎంతో ఆకర్షిస్తున్నాయి.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకేంద్రం గాయత్రినగర్‌లోని గాయిత్రి ఆలయంలో సహస్ర లింగార్చన నిర్వహించారు. 1128 మరకత శివ లింగాలకు పూజారులు, భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.