చిత్రం చెప్పే విశేషాలు..!

(18-08-2022/1)

సాలూరు మండలం తోణాం పంచాయతీ బొర్రమామిడివలస గ్రామంలో కనిపిస్తున్న ఈ రేకుల షెడ్డు పశువుల పాక అనుకుంటే పొరపాటే. ఇది ప్రాథమిక పాఠశాల. ఇక్కడ పది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ఇందులో నిర్వహిస్తున్నారు.

Source: Eenadu

చుట్టూ నిర్మానుష్యం. ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఒక్క ఇంటికి ఇంత పెద్ద నీటి ట్యాంక్‌ ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా..? కరివెన జలాశయ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన గ్రామాల ప్రజలు వేరే చోటకు తరలివెళ్లారు. ఈ ఇంటి యజమాని భవనాన్ని కూల్చేయకుండా వదిలేశాడు.

Source: Eenadu

భీంపూర్‌ మండలంలోని ఇందూర్‌పల్లి-అర్లి-టి గ్రామాల నడుమ ఉన్న వంతెన సమీపంలోని గుంతలో ఆర్టీసీ బస్సు ఇలా కూరుకుపోయింది. ఆ బస్సును బయటకు తీసేందుకు ట్రాక్టరు ఉపయోగించాల్సి వచ్చింది. అధికారులు ఇప్పటికైనా రోడ్డు దుస్థితిని బాగు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.

Source: Eenadu

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లికి చెందిన కొందరు యువకులు ఊరిలో ఎత్తుగా ఉండే కోనగుట్టపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పచ్చని గుట్టపై రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా అందరినీ ఆకట్టుకుంటోంది.

Source: Eenadu


ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ప్రజ్యోత్‌సింగ్‌ చౌహాన్‌ రిథమిక్‌ యోగాసనంలో భాగంగా వేసిన పరివృత్త ఉపవిష్ఠ కోణాసనం అదిరింది. దిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగానే తెలంగాణ-32 పటాలంకు చెందిన ఈ ఎన్‌సీసీ విద్యార్థి పాల్గొన్నారు.

Source: Eenadu

తిరుమలలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొదటి ఘాట్‌ రోడ్డులోని మాల్వాడిగుండం జలపాతం ప్రవహిస్తోంది. శేషాచల అటవీ ప్రాంతంలో ఎత్తైన అందమైన ప్రదేశంలో ఏర్పడిన ఈ ప్రకృతి రమణీయమైన జలపాతాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

Source: Eenadu

పాత గాజువాక లంకా మైదానంలో ఎస్‌వీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 89 అడుగుల ఎత్తైన గణపతి మండపంలో విగ్రహానికి బుధవారం పాదపూజ నిర్వహించారు. ఈనెల 20వ తేదీ సాయంత్రానికి విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటుందని నిర్వాహక కమిటీ సభ్యుడు కె.గణేష్‌ తెలిపారు.

Source: Eenadu

ఏపీ రాజధాని నిర్మాణాలు జరుగుతున్న రోజుల్లో నిత్యం భారీ వాహనాల రాకపోకలతో సందడిగా ఉండే రహదారి ఇది. మూడేళ్లుగా నిర్మాణ పనులు జరగకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయి కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లడానికి వీలులేనంతగా మారిపోయి కుంగిపోయాయి.

Source: Eenadu

సముద్ర కెరటాల ఉద్ధృతికి కాకినాడ జిల్లాలోని కొన్ని తీరప్రాంతాల గ్రామాలు వణుకుతున్నాయి. అలల తాకిడి నుంచి రక్షణకు ఉప్పాడ కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాళ్ల కట్ట, జియోట్యూబ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home