చిత్రం చెప్పే విశేషాలు..!
(28-08-2022/1)
బాపట్ల జిల్లాకు చెందిన మార్కు అనే రైతుకు ఎకరం భూమి ఉంది. సాగు నీరు లేకపోవడంతో 25 మీటర్ల దూరంలో ఉన్న చేతిపంపు నీరు ఓ బకెట్‌లో పడేలా కట్టి.. ఆ బకెట్‌కు పైపు అనుసంధానించి పొలంలో నీరు పోసేలా చేసుకున్నారు.
Source: Eenadu
వైయస్‌ఆర్ జిల్లా చాపాడు మండల సర్వసభ్య సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో పురుషులు హాజరుకావడం చర్చనీయాంశమైంది. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశానికి మహిళా ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. వారి స్థానంలో కుటుంబ సభ్యులు వచ్చారు.
Source: Eenadu
నిజామాబాద్‌లోని పులాంగ్ వాగు ఒడ్డున ఉన్న ఖాళీ స్థలంలో కనిపించింది దృశ్యమిది. ఇక్కడ క్రికెట్ సాధన కోసం గతంలో నెట్ ఏర్పాటు చేశారు. చాలా రోజులుగా దీన్ని ఎవరూ ఉపయోగించక పోవడంతో పక్షులు ఆశ్రయించి ఇలా గూళ్లను ఏర్పాటు చేసుకున్నాయి.
Source: Eenadu
నారాయణపేట జిల్లా ఆసుపత్రి మొదటి అంతస్తు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గదుల కొరత కారణంగా ఇప్పటికీ 5 విభాగాలు శిథిలమైన గదుల్లోనే కొనసాగుతున్నాయి. ఎప్పుడు పైకప్పు కూలి తలలు పగులుతాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Source: Eenadu
గుజరాత్ కుచ్ జిల్లాలోని భుజ్‌లో ఏర్పాటుచేసిన స్మృతివన్ స్మారకం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దీన్ని ప్రారంభించనున్నారు.
Source: Eenadu
నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ఆవరణలో అధికారులు పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్నారు. మియావాకి పద్ధతిని అనుసరించి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏడాదిగా 40 వేల మొక్కలు పెంచుతున్నారు.
Source: Eenadu
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి శివారులోని బావులకు సరఫరా నిలిచిపోవడంతో రైతులు విద్యుత్తు సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్లెవరూ రాకపోవడంతో స్వయంగా ట్రాన్స్‌ఫార్మర్ ఏబీ స్విచ్ వద్ద సరఫరా నిలిపివేసి పైకి ఎక్కి ఫ్యూజులు సరి చేసుకోవాల్సి వచ్చింది.
Source: Eenadu
జులైలో కురిసిన భారీ వర్షాలకు పల్లెదారులు అధ్వానంగా మారాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ నుంచి పాకాలకు వెళ్లే మార్గంలో కల్వర్టు ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఒకవైపు పోసిన మట్టి కొట్టుకుపోయింది. రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
Source: Eenadu