చిత్రం చెప్పే విశేషాలు!

(29-08-2022/1)

రెండు కిలోలుపైగా బరువున్న గోదావరి పులస ఏకంగా రూ.23 వేలకు అమ్ముడుపోయింది. యానాం రాజీవ్‌బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద గోదావరి పులసను శనివారం సాయంత్రం మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం రూ.22వేలకు కొనుగోలు చేసి రూ.23 వేలకు విక్రయించారు.

Source: Eenadu

విశాఖ నగరంలో కుక్కలు రక్తదానం చేశాయి. కుక్కలేంటి.. రక్తదానమేంటని అనుకుంటున్నారా! అదేనండీ.. పెంపుడు కుక్కల రక్తాన్ని వాటి యజమానులు ఆపదలో ఉన్న శునకాల కోసమని దానం చేశారు. విశాఖ పెదవాల్తేరులోని ‘పావ్స్‌ ఎన్‌ టైల్స్‌’ సంస్థ నిర్వహించిన శిబిరంలో రక్తం సేకరించారు.

Source: Eenadu

రాజధాని సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ‘ఐ లవ్‌ అమరావతి’ పేరిట తాడేపల్లిలో ఉద్యానవనాన్ని సీఆర్‌డీఏ తీర్చిదిద్దింది. ఇప్పుడు ఇలా పిచ్చిమొక్కలు, తుప్పలు పెరిగాయి. ఫౌంటెయిన్‌ పనిచేయకపోవడంతోపాటు, దానికి ఏర్పాటుచేసిన ఫలకలు ఊడిపోతున్నాయి.

Source: Eenadu

దివి సీమలో సముద్ర తీర ప్రాంతమైన హంసలదీవి శివారు పాలకాయతిప్పలోని సముద్ర కరకట్టకు ఉన్న అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ శిథిలమై ఇనుప చువ్వలు తేలాయి. దీంతో కొన్నేళ్లుగా ఉప్పు నీరు గ్రామాల్లోకి వస్తోంది. దీని వల్ల 3 వేల ఎకరాల పంటభూములు నిరుపయోగంగా మారాయి.

Source: Eenadu

‘మన్‌కీ బాత్‌’ సందర్భంగా.. ‘అమృత్‌ సరోవర్‌ మిషన్‌’లో భాగంగా తెలంగాణలోని వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ తండాలో నిర్మించిన కుంట గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘‘అద్భుత ప్రయత్నమిది. నీటిని నిల్వ చేసుకోవడానికి ఇది దోహదపడుతోంది’’ అని ప్రధాని ప్రశంసించారు.

Source: Eenadu

ఇటీవల కురిసిన వర్షాలకు ఆదోని పట్టణంలోని నెహ్రూ ఉద్యానవనంలోకి పెద్దఎత్తున నీరు చేరింది. పిల్లలు ఆదివారం సాయంత్రం బురద నీటి మధ్యే ఆడుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు భరింపరాని దుర్గంధం వస్తుండటంతో జనం ఇబ్బందులు పడ్డారు.

Source: Eenadu

ఈ ఊడలమర్రి ఏ తలకోన అడవిలోదో అనుకుంటే పొరపాటే. పాలసముద్రం మండలంలోని స్థానిక పంచాయతీ కుమ్మరిండ్లు పరిధిలో ఒకటిన్నర ఎకరంలో విస్తరించిన 250 ఏళ్ల నాటి చెట్టు ఇది. తరాలు మారుతున్నా అవాంతరాలను తట్టుకుని ఇంకా నిలబడే ఉంది.

Source: Eenadu

చిత్తూరు జిల్లా జలపాతాలకు నిలయం. ఇక్కడి ‘గిడుగు జలపాతం’ అందాలు చూడాలంటే తిమ్మరాజపురం నుంచి దాదాపు 3 కి.మీ అడవిలో నడక సాగించాలి. ఈ జలపాతానికి వెళ్లే దారిలో ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. దాదాపు 55 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతూ జలపాతం ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home