చిత్రం చెప్పే విశేషాలు! (08/09/2022/2)
హుస్సేన్ సాగర్‌లో శుక్రవారం వినాయక విగ్రహాల నిమజ్జనాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసరాలు విద్యుద్దీపాల కాంతులతో వెలుగులీనుతూ సుందరంగా కనిపించాయి..
ఓనం పండగ పురస్కరించుకొని గురువారం సాయంత్రం బొల్లారంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ముగ్గులతో అలంకరిస్తున్న కేరళ యువతులు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్‌వరకు సెంట్రల్‌విస్టా అవెన్యూ ప్రారంభోత్సవానికి ముందు దిల్లీలోని ఇండియా గేట్ వద్ద 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహానికి గురువారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్రీడాకారులతో కలిసి నృత్యం చేశారు.
ఖైరతాబాద్‌లోని మహా గణనాథుడిని గురువారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. పలువురు భారీ గణపయ్యను ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడ్డారు.
తిరుమలలో చిరుజల్లులు కురుస్తుండటంతో అక్కడి పచ్చదనం, జలపాతాలతో ప్రకృతి అందంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలను చూస్తూ భక్తులు పరవశించిపోతున్నారు.
పాటియాలాలో ‘గగన్ స్ట్రైక్’ పేరుతో భారత ఆర్మీ.. గ్రౌండ్ ఫోర్సెస్, యుద్ధ హెలికాప్టర్లతో సంయుక్త విన్యాసాలు నిర్వహించింది.
తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రను ప్రారంభించారు. ఉదయం జాతీయ జెండాను ఎగురవేసి.. ఆయన ముందుకు కదిలారు. పలువురితో మాట్లాడుతూ రాహుల్ నడక సాగిస్తున్నారు. యాత్రలో పాల్గొన్న ఓ చిన్నారితో ఇలా ముచ్చటిస్తూ కనిపించారు.