చిత్రం చెప్పే విశేషాలు..!(17-09-2022/1)
అల్లూరిసీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వెదరునగరం గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపాన మనిషి చెయ్యెత్తు కంటే ఎక్కువ ఎత్తుగా చీమల పుట్ట ఉంది. వర్షాకాలం నేపథ్యంలో చీమలు తయారు చేసిన ఈ పుట్టను పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
#Eenadu
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపాన ఉన్న పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 6.13 నుంచి 6.17 గంటల మధ్య సూర్య కిరణాలు స్వామిపై ప్రసరించాయి. నాలుగేళ్ల తరువాత భాద్రపద మాసంలో ఈ అరుదైన ఘట్టం సాక్షాత్కరించినట్లు అర్చకులు తెలిపారు.
#Eenadu
అడుగుకో గుంతతో కనిపిస్తున్న ఈ రహదారి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. నంద్యాల జిల్లా డోన్ పట్టణం నుంచి వెంకటనాయునిపల్లెకు వెళ్లే ఈ దారిలో 250మీటర్ల దూరంలోనే 120గుంతలు ఉండటం గమనార్హం. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు పెద్దవిగా మారి రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
#Eenadu
ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌కు చెందిన శివకుమార్ రావి ఆకుపై మోదీ చిత్రాన్ని,సెప్టెంబరు 17 నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన సందర్భంగా సర్దార్ వల్లభాయి పటేల్ ఎదుట నిజాం నవాబు లొంగిపోతున్న చిత్రాలను గీశారు.
#Eenadu
హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజును పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం వేడుకలు నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి చారిత్రక కట్టడాలైన చార్మినార్, మొజంజాహి మార్కెట్‌లు మువ్వన్నెల వెలుగుల్లో మెరిసిపోయాయి.
#Eenadu
కరీంనగర్‌లోని శంకరపట్నంలో కొందరు వ్యక్తులు వివిధ రకాల వాహనాల విడిభాగాలు ఇష్టానుసారంగా తొలగించి స్క్రాప్ కింద విక్రయాల దందా కొనసాగిస్తున్నారు. నిత్యం రహదారి పక్కనే గ్యాస్ కట్టర్ సహాయంతో విడిభాగాలు తొలగిస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
#Eenadu
ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా కడియంలోని నర్సరీలో లక్ష పూలతో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
#Eenadu