చిత్రం చెప్పే విశేషాలు!
(30-09-2022/1)
శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళిలో రెండు రోజులుగా జరుగుతున్న కొత్తమ్మతల్లి జాతర గురువారం ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా జంగిడి(నైవేద్యం)ని ఆలయానికి చేర్చారు.
Source: Eenadu
కేసీ కాలువ పరిధిలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పొలాలకు నీటిని మళ్లించేందుకు పిల్ల కాలువలు లేవు. దీంతో కాలువ గట్లపై మోటార్లు పెట్టుకొని రెండు కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని మళ్లించుకుంటున్నారు.
Source: Eenadu
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్ ఎడమ కాలువలో ఓ పాము నత్త పెంకును నోట కరచుకొని అటూ ఇటూ చక్కర్లు కొట్టింది. కొంతసేపటికి ఆ పెంకు నోటికి అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఎంతో హైరానా పడింది. చివరికి జనం అలికిడికి తుర్రుమని తుప్పల్లోకి వెళ్లిపోయింది.
Source: Eenadu
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడులో శిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధ్వజస్తంభంపై బుధవారం రాత్రి పిడుగు పడింది. ఆ ధాటికి ధ్వజస్తంభం పైనుంచి కింది వరకు నిలువునా రెండుగా చీలిపోయింది.
Source: Eenadu
వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పట్టణ పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యం నీరుగారింది. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను చూస్తే అడవిని తలపిస్తోంది. ఇళ్ల మధ్య కంప చెట్లు పెరిగాయి. వాననీరు నిలిచి పునాదులన్నీ కుంటలుగా మారాయి.
Source: Eenadu
దసరా సెలవులు రావడంతో నిర్మల్ జిల్లా వాస్తాపూర్‌లో సందడి నెలకొంది. ఘాట్ రోడ్డు అందాలను వీక్షిస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ పర్యాటకులు సంబరపడుతున్నారు. జలపాతం వద్ద ఉత్సాహంగా గడుపుతున్నారు.
Source: Eenadu
నల్లమల అభయారణ్యంలో కొండలపై నుంచి పడుతున్న జలధారలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అచ్చంపేట మండలం మల్లెలతీర్థంలో జలధారలు పెరగడంతో భక్తులు, పర్యటకులు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Source: Eenadu
కొల్చారం మండలం రంగంపేట హనుమాన్ ఆలయంలో దీపాలంకరణ..
Source: Eenadu