చిత్రం చెప్పే విశేషాలు..!

(12-10-2022/1)

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం-సీతానగరం రోడ్డు బురదతో అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ముగ్గళ్ల వద్ద మంగళవారం ఉదయం లారీ దిగబడింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 3 కి.మీ. మేర వాహనాలు బారులు తీరాయి.

Source: Eenadu

‘అయ్యా! జగన్‌మోహన్‌రెడ్డి... మీకు ఓట్లేశాం. ఇప్పుడు బురద మార్గంలో రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నాం’ అంటూ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం మెట్లవారిపాలెం వాసులు మంగళవారం నిరసన తెలిపారు.

Source: Eenadu

కేపీహెచ్‌బీ నెక్సెస్‌ మాల్‌లో సినీ నటి హెబ్బా పటేల్‌ సందడి చేశారు. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ బంపర్‌ డ్రాలో లక్కీ కూపన్‌ తీసి విజేతను ప్రకటించారు. విజేత రూ.20 లక్షలు గెలుచుకున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Source: Eenadu

ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని గీతాంజలి విద్యానికేతన్‌కు వెళ్లే మార్గంలో భల్లూక రూపంలో ఉన్న మోడు ఇది. ఒక్కసారిగా చూసినవారు భయపడుతున్నారు. తీక్షణంగా చూసి కుదుటపడుతున్నారు.

Source: Eenadu

గూగుల్‌ మ్యాప్‌లో కొత్తగూడెం వీధుల నమోదు కోసం ఓ కారుపై ప్రత్యేక పరికరంతో సంచరిస్తున్నారు. ఇప్పటికే గమ్యస్థానాలకు సులువుగా చేరుకునేందుకు పలువురు గూగుల్‌ మ్యాప్స్‌ను వినియోగిస్తున్న క్రమంలో వాటి సేవలను మరింత విస్తరిస్తున్నారు.

Source: Eenadu

మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలోని శివాలయంలో ఉన్న ఐదడుగుల వినాయక విగ్రహం చాళుక్యుల కాలం నాటిదని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్‌ స్పష్టంచేశారు. 15 ఏళ్ల కిందట పడకుల కుంట విస్తరణ పనుల్లో ఈ ప్రతిమ లభ్యమైంది.

Source: Eenadu

చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానంలో అరేకాపామ్‌ ఆకట్టుకుంటున్నాయి. అందంతోపాటు ఆరోగ్యాన్ని ఇచ్చే వీటిని పోక చెట్లు అని కూడా పిలుస్తారు. వీటిని ఆర్నమెంటల్‌ ప్లాంట్స్‌గా ఇంటి పెరట్లోనూ, పూల వనాల్లో పెంచుకోవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.

Source: Eenadu

పంటల్లో సులభంగా పురుగుమందు పిచికారీ, అంతర సేద్యానికి అనువుగా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామానికి చెందిన ముత్యాలప్ప అనే రైతు సాధారణ ట్రాక్టరును కొత్తగా మార్పు చేయించారు. దీంతో 20 నిమిషాల్లో 2.5 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చని రైతు వివరించారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home