చిత్రం చెప్పే విశేషాలు!(25-07-22)

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం - శివపురం గ్రామాల మధ్య పొలాల్లో ఉన్న విద్యుత్తు స్తంభాల పరిస్థితి ఇది. నాలుగేళ్ల కిందట వచ్చిన తుపానుకు వరుసగా ఉన్న దాదాపు పదిహేను స్తంభాలు ఓ వైపు ఒరిగాయి. అధికారులు పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు.

Source: Eenadu

నీరు పక్కనే ఉన్నా రైతుల పొలాల్లో పారని దుస్థితి . ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు ఎత్తిపోతల పథకం, కంచికచర్ల మండలంలోని కునికినపాడు ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. 2019లో వచ్చిన వరదల్లో దాములూరు ఎత్తిపోతల పథకం మునిగిపోయి పనిచేయడం లేదు.

Source: Eenadu

ఎనిమిది పదుల వయసు దాటినా...ఇప్పటికి నడక మీదనే ఆధారపడుతున్నారు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత డైట్‌ అధ్యాపకుడు తుమ్మల మల్లారెడ్డి. నిత్యం కనీసం 10కి.మీ. నడుస్తుంటారు. 82 సంవత్సరాల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటానికి నడకే కారణమని చెబుతున్నారు మల్లారెడ్డి.

Source: Eenadu

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్‌లో ఓ పూరి గుడిసెను ఆనపకాయ తీగ అల్లుకొని హరిత గృహంలా కనిపిస్తోంది. గ్రామానికి చెందిన మాదారం రవికి చెందిన పూరిల్లు ప్రత్యేకంగా నిలుస్తోంది. గుడిసె పక్కన నాటగా తీగలు విస్తరించి గుడిసెనంతా దట్టంగా ఆక్రమించింది.

Source: Eenadu

శాంతికాముకుడి వస్త్రానికి కపోతాలు వరుసగా అల్లుకుని ఆయనకు మరింత సోయగం తెస్తే ఎలా ఉంటుంది? అలాంటి సుందర దృశ్యమే అమరావతిలో ఉన్న ధ్యాన బుద్ధ విగ్రహం దగ్గర ప్రతి రోజూ ఆవిష్కృతమౌతోంది. పావురాలు బుద్ధుడి విగ్రహ వస్త్రాలంకరణ చుట్టూ చేరి విగ్రహానికి వన్నె తెస్తున్నాయి.

Source: Eenadu

విడపనకల్లు నుంచి కొట్టాలపల్లి దిశగా వెళ్లే తాగునీటి పైపులైన్‌ నుంచి లీకవుతున్న నీరు ఆసరాగా నిలుస్తోంది. కర్ణాటక నుంచి గొర్రెలు మేపుకొనేందుకు వచ్చిన కొందరు కాపరులు కొట్టాలపల్లి పొలాల్లో ఉంటారు. ఎయిర్‌వాల్వ్‌ పైభాగానికి చీరచుట్టి బిందెల్లోకి పట్టుకుంటున్నారు.

Source: Eenadu

భీమిలి బీచ్‌లోని గాంధీ, బుద్ధ పార్కులు కళ తప్పాయి. రంగులు వెలిసి, శిథిలమై, పక్షుల రెట్టలతో మహనీయుల విగ్రహాలు దయనీయంగా ఉన్నాయి. బీచ్‌ సందర్శనకు వచ్చే పలువురు వీటి దుస్థితిని చూసి పార్కుల నిర్వహణ ఇలాగేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Source: Eenadu

ఎండ్ల బళ్లతో ఇసుక రవాణాకు అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం సంతతోట వద్ద ఏడొంపుల గెడ్డపై వంతెనకు వంద మీటర్ల దూరంలోనే నిత్యం వందల సంఖ్యలో బళ్లు కనిపిస్తున్నాయి.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home