చిత్రం చెప్పే విశేషాలు..!
(14-08-2022/1)
విశాఖ తెలుగుతల్లి పైవంతెన వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందడంతో మరెవరికీ అటువంటి ఆపద రాకూడదని భావించిన ఆయన కుటుంబీకులు శుక్రవారం దాన్ని కాంక్రీట్‌తో పూడ్చారు. ఆ తర్వాత జీవీఎంసీ అధికారులు కాంక్రీటుపై బీటీ లేయర్ వేశారు.
Source: Eenadu
ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు మనుమడి వివాహం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులు సంతోష్, తరణలను ఆశీర్వదించారు.
Source: Eenadu
దివిసీమలో సముద్రపు అలలకు హంసలదీవి రహదారి కోతకు గురవుతోంది. తుపానులు, వరదలకు, నదీ జలాలు సముద్రంలో కలవడం వల్ల కెరటాల పోటుకు రహదారి ఇలా ధ్వంసమైంది. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్‌లో కనిపించిన చిత్రమిది.
Source: Eenadu
కంకిపాడు లాకు రోడ్డులోని ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహం గత 50 ఏళ్లుగా నిత్య పూజలందుకుంటోంది. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దివంగత గాంధంశెట్టి కోటేశ్వరరావు 1972 ఆగస్టు 15న తన ఇంటి ఎదుట గాంధీ విగ్రహం నిర్మించారు.
Source: Eenadu
తమిళనాడు రాష్ట్రం మదురైకు చెందిన ‘గోల్డ్‌మెన్’ వరుచూర్ సెల్వం శనివారం చిత్తూరు నగరానికి వచ్చారు. ఏపీ మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్ సురేశ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Source: Eenadu
ఆదోని పట్టణానికి చెందిన అశోక్ శ్రీనాథ్ అనే యువకుడు 0.2 మిల్లీమీటర్ల పరిమాణంలో జాతీయ జెండా తయారు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పెన్ను నిబ్‌పై సూక్ష్మ కళతో దీనిని రూపొందించారు.
Source: Eenadu
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జల సోయగాలను చూసేందుకు.. మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శనివారం రాత్రి వాహనాల లైట్ల కాంతులు నల్లమల కొండలకు కొత్త అందాలను తెచ్చాయి.
Source: Eenadu
సాధారణంగా పెళ్లి అనగానే బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాలు వినిపిస్తాయి. ఆదిలాబాద్ పట్టణ శివారులో ఓ ఫంక్షన్ హాలులో జరిగిన వివాహ వేడుకలో జనగణమన జాతీయగీతం, భారతమాతాకీ జై నినాదాలు మారుమోగాయి. 75ఏళ్ల అమృతోత్సవ వేళ పెళ్లి వేడుకను ప్రత్యేకంగా జరుపుకొన్నారు.
Source: Eenadu
ఎల్‌ఎండీ జలాశయం స్పిల్ వే గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా ఆ స్పిల్ వే గేట్లపై శనివారం అధికారులు మువ్వన్నెల రంగులు కలిగిన విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో మువ్వన్నెల వెలుగుల్లో ఆరు గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతుండడం ఆకట్టుకుంది.
Source: Eenadu