చిత్రం చెప్పే విశేషాలు..!
(20-11-2022/1)
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్ దుస్థితి ఇది. తెదేపా హయాంలో రూ.30 లక్షల వ్యయంతో పాత ఆకాశ వంతెన కింది భాగంలో క్యాంటీన్‌ను నిర్మించారు. పూటకు 500 మంది భోజనం చేసేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్‌లను తొలగించారు.
source : eenadu
భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు పెరిగినా తట్టుకునే వరి వంగడాలను రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించారు. ‘హీట్ టన్నెల్’లో వరి పండించి, వాతావరణంలో మార్పులకు తగ్గట్టుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు.
source : eenadu
రామచిలుక ఒకటి కనిపిస్తేనే ఆనందంగా చూస్తుంటాం. అలాంటిది పదుల సంఖ్యలో కనిపిస్తే ఆ దృశ్యం వర్ణనాతీతం. నిర్మల్ గ్రామీణ మండలంలోని రాణాపూర్ నుంచి నిర్మల్ వచ్చే మార్గంలో కనిపించిన దృశ్యాలివి.
source : eenadu
హుజూరాబాద్ పోలీసు స్టేషన్‌లో సెంట్రీ డ్యూటీలో ఉన్నట్లు కనపడుతున్న ఈ దృశ్యాన్ని చూశారుగా... ఆయన నిజంగా పోలీసు అనుకుంటే పొరపడినట్లే... ట్రాఫిక్ పోలీసు రూపంలో ఉన్న బొమ్మను పోలీసుస్టేషన్ గేటు వద్ద గార్డ్ రూమ్‌లో విధుల్లో ఉన్న పోలీసు మాదిరిగా ఏర్పాటు చేశారు.
source : eenadu
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ శివారులోని గోదావరిలో మత్య్సకారుడు కృష్ణ శనివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లారు. వలకు చేపలతో పాటు వర్ణశోభితంగా ఉన్న తాబేలు చిక్కింది. విభిన్న రంగులతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ కూర్మం చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.
source : eenadu
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్ సరస్సులో ఆహారం కోసం వచ్చిన ప్లెమింగో పక్షులు కనువిందు చేస్తున్నాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్ దేశాల నుంచి వేలాదిగా పక్షులు వస్తాయి.
source : eenadu
హైదరాబాద్ నగరంలో మెట్లబావుల రూపు మారుతోంది. కొత్త సొబగులు అద్దుకుంటూ సరికొత్త పర్యాటక ప్రాంతాలవుతున్నాయి. ఈ జాబితాలో బన్సీలాల్‌పేట చేరనుంది. ఇక్కడ అభివృద్ధి చేసిన పురాతన మెట్ల బావిని ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నారు.
source : eenadu
శీతాకాలం రాకతో మన్యం పులకిస్తోంది. మోతుగూడెం నుంచి సీలేరు, మారేడుమిల్లి మార్గంలో ఎత్తైన కొండలను అలముకుంటున్న మంచు పొరలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.
source : eenadu