చిత్రం చెప్పే విశేషాలు!

(23-08-2022/1)

హుస్సేన్‌ సాగర్‌ సమీపంలోని సైదానిమా మెట్లబావి పునరుద్ధరణను చేపట్టినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు పనులు కొనసాగుతుండగా చెత్తా, చెదారం, వ్యర్థాలు తొలగించిన చిత్రాలను జతపరిచారు.

Source: Eenadu

దుర్గం చెరువు తీగల వంతెనపై అర్ధరాత్రి వాహనదారులు వేడుకల పేరిట వాహనాలను పార్కింగ్‌ చేసి.. ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ప్రస్తుతం గస్తీ లేకపోవడంతో వాహనాలు నిలిపి.. అరుపులు కేకలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Source: Eenadu

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు ఆరేళ్ల క్రితం ఎముకల క్యాన్సర్‌ సోకింది. ఇంటి కిరాయి చెల్లించే స్థోమత లేక తన భార్య, పిల్లలతో స్థానికంగా నిరుపయోగంగా ఉన్న అంగన్‌వాడీ భవనంలో నివాసం ఉంటున్నాడు.

Source: Eenadu

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అగ్నిమాపక వాహనం పైపుల ద్వారా జాతీయ జెండా ఆకారం కనిపించేలా మూడు రంగులు కలిపిన నీటిని విరజిమ్మటంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు.

Source: Eenadu

వ్యవసాయ పనులకు చిన్న ఆటోలో 25 మందికిపైగా కూలీలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఈ చిత్రం రఘునాథపాలెం మండలం చింతగుర్తి సమీపంలోనిది. గ్రామం నుంచి పరిసరాల్లోని పంట పొలాలకు నిత్యం ఈ విధంగా ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. 

Source: Eenadu

మంత్రాలయం మండలంలోని పలు గ్రామాల విద్యార్థులు చదువుకునేందుకు మంత్రాలయానికి వస్తుంటారు. నాలుగు గంటలకే పాఠశాల వదిలేసినా వారి ఊళ్లకు వెళ్లే బస్సులు 5.30గంటల తర్వాతే వస్తాయి. దీంతో సమయాన్ని వృథా చేయకుండా శ్రద్ధగా ఇలా బస్టాండులోనే హోం వర్క్‌ పూర్తి చేస్తున్నారు.

Source: Eenadu

కృష్ణా నదిలో పెరుగుతున్న వరద పాత ఎడ్లంక విద్యార్థులను కలవరపెడుతోంది. 50 మందికి పైగా చిన్నారులు అవనిగడ్డలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్నారు. బడికి వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. సోమవారం వరదనీటి ఉద్ధృతి పెరగడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇలా దింపుతున్నారు.

Source: Eenadu

మద్య, ధూమపానంతో కలిగే అనర్థాలను వివరిస్తూ.. ప్రజలను చైతన్యం చేస్తూ చెన్నై నగరానికి చెందిన ఆర్ముగం.. చెన్నై నుంచి దిల్లీకి స్కూటర్‌ యాత్ర చేపట్టారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌కు చేరుకుని జేసీ కూర్మనాథ్‌ను కలిసి పర్యటన వివరాలు వెల్లడించారు.

Source: Eenadu

అతి చిన్న అనాసపండు(పైనాపిల్‌) చూపరులను అబ్బురపరుస్తోంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజవోలు గ్రామానికి చెందిన చుండ్రు శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఏడాదిన్నర కిందట తన ఇంటిపెరటిలో అనాస మొక్కను నాటారు. దానికి కాసిన పండు 150 గ్రాముల బరువు ఉంది.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home