చిత్రం చెప్పే విశేషాలు..!

(08-08-2022/1)

గత నెలలో కురిసిన వర్షాల సమయంలో ఈనాడులో గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్‌ నుంచి పలకలూరు వెళ్లే రహదారి చిత్రం ప్రచురితమవడంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇప్పుడు మళ్లీ గుంతలు ఏర్పడగా అందులో మిర్చి బస్తాల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ ఇలా బోల్తా పడింది.

Source: Eenadu

రాజధాని అమరావతి ప్రాంతంలో భవనాలు, వంతెన నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేయడంతో వాటి కోసం తవ్విన భారీ గుంతల్లో వర్షపునీరు చేరి మృత్యుకుహరాల్లా తయారయ్యాయి. ఆయా చోట్ల పశువులు దిగితే ఇనుపచువ్వలు గుచ్చుకుని బయటకు రాలేని పరిస్థితి.

Source: Eenadu

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం చూసి పొలం అనుకుంటే మీరు బురదలో కాలేసినట్లే. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మండలిపురం పక్కనే ఉన్న జగనన్న రహదారి బంగ్లా లేఔట్‌ ఇది. వాన నీరు చేరి పొలంలా మారింది.

Source: Eenadu

గుడిబండ మండలం మద్దనకుంట గ్రామానికి చెందిన షబానా పెంచిన సీమ కోడి ఆదివారం గోలి పరిమాణంలో గుడ్డు పెట్టింది. పరిసర గ్రామస్థులు వింతగా వీక్షించారు. ఈ కోడి రోజూ సాధారణ సైజులో గుడ్డు పెట్టేది.

Source: Eenadu

విశాఖ మన్యం లంబసింగిలో ఆదివారం మంచు దోబూచులాడింది. వర్షం వచ్చి వెలిశాక.. అకస్మాత్తుగా మంచు మేఘాలు పచ్చని కొండల్ని హిమగిరులుగా మార్చేశాయి. ముందే పలకరిస్తున్న మంచు సోయగాలు మన్యానికి వచ్చే పర్యటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

Source: Eenadu

పెదవాల్తేరు జీవ వైవిధ్య ఉద్యానవనంలో ఆర్కిడ్‌ పుష్పాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పూలు ఎక్కువగా కనిపిస్తాయి. తూర్పుకనుమల్లో అధికంగా ఉంటాయి.

Source: Eenadu

విశాఖ నగరంలోని ఓ మేనేజ్‌మెంట్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి కాసేపు పొలం పనుల్లో పాల్గొన్నారు. నాట్లు వేశారు. వ్యవసాయ పనుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

Source: Eenadu

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని నెల్లివీడు, నర్సింగాపూర్‌, కొన్నూరు, ద్వారకానగర్‌ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాలలోని ఆరో తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థులంతా మండల కేంద్రం మదనాపురానికి ఇలా రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు(29-03-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(28-03-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (28-03-2024/1)

Eenadu.net Home