చిత్రం చెప్పే విశేషాలు!

(04-09-2022/1)

విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బూట్లు, ఏకరూప దుస్తులను ఉపాధ్యాయులు తమ పాఠశాలలకు మోసుకుని వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని స్కూల్‌ కాంప్లెక్సులో వీటి పంపిణీ జరిగింది.

Source: Eenadu

కాళ్లకు ఇనుప సంకెళ్లతో జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో మురుగు కాలువలో పడిపోయి ఉన్న ఈ యువకుడిని స్థానికులు చేరదీశారు. తన పేరు నవీన్‌ అని మూడు నెలల కిందట కుటుంబ సభ్యులు ఇలా కాళ్లకు సంకెళ్లు వేసి కొండగట్టులో వదిలి వెళ్లారని బాధితుడు వెల్లడించాడు.

Source: Eenadu

వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌)లో శనివారం నిర్వహించిన 20వ స్నాతకోత్సవంలో పట్టాలందుకున్న విద్యార్థినుల ఆనందం అంబరాన్నంటింది.. రెండు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో తొలిరోజు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన 8 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు.

Source: Eenadu

ఈయన జూలూరుపాడు మండలం గంగారం తండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎం.భద్రయ్య. ఆయన పక్కనే ఉన్న బల్లలు ఖాళీగా ఉన్నాయేంటని అడిగితే అసలు పిల్లలు ఉంటేగా అనే సమాధానం వస్తోంది.

Source: Eenadu

నేలమ్మను చీరలా చుట్టేసిన పచ్చదనం.. పైన నీలాకాశంలో పాల నురగలాంటి తెల్లటి మేఘాలు.. పాలమూరు పట్టణంలో శనివారం ఉదయం కనిపించిన అద్భుత దృశ్యమిది. ప్రకృతి ప్రేమికులను కనులు తిప్పుకోనీకుండా చేసింది.

Source: Eenadu

పెదనందిపాడు మండలం నాగులపాడులో శ్రీరామ యూత్‌ ఆధ్వర్యంలో కోదండ రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని రూ.77,77,777 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు తరలి వచ్చి గణనాథుని దర్శించుకుని పూజలు చేశారు.

Source: Eenadu

గుంటూరు ఎన్టీఆర్‌ కూడలి సమీపంలోని పూలమార్కెట్‌ రైతుబజారు వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతోంది. వచ్చే జనానికి ఇబ్బందిగా తయారయ్యింది. కార్పొరేషన్‌ చెత్త తీసుకువెళ్లే వాహనాలు సకాలంలో రాకపోవడంతో ఎప్పటికప్పుడు పరిస్థితి దిగజారుతోంది.

Source: Eenadu

నల్లమల అటవీ సోయగం వర్ణించతరం కానిది. ఆ కొండల నడుమ కొలువైన మహానందీశుని క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. పచ్చని గిరుల్లో కొలువైన స్వామికి మేఘాలు గొడుగు పట్టినట్లుగా కనిపించే ఈ దృశ్యం చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home