చిత్రం చెప్పే విశేషాలు..!
(11-09-2022/1)
తుంగభద్ర ఉగ్రరూపం దాల్చింది. దీనికితోడు వేదవతి నది ఉప్పొంగి తుంగభద్రలో కలవడంతో నదికి భారీగా వరద పోటెత్తింది. ఫలితంగా కర్నూలు జిల్లా కోసిగి, కౌతాళం మండలాల్లో దాదాపు 1,200 ఎకరాల్లో పత్తి, వరి తదితర పంటలు నీట మునిగాయి. అన్నదాతలకు అపార నష్టం జరిగింది.
Source: Eenadu
కరీంనగర్‌లోని గాంధీ చౌరస్తాలో నెలకొల్పిన భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన చోటే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో శనివారం రాత్రి నిమజ్జనం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కదిలివచ్చి ఆసక్తిగా తిలకించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Source: Eenadu
కరీంనగర్‌లో వినాయకుడిని తొమ్మిది రోజుల పాటు ఘనంగా కొలిచిన భక్తజనం శుక్రవారం రాత్రి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. నీటిలోని విగ్రహాల నుంచి పలువురు పేదలు ఇనుప చువ్వలు సేకరించి విక్రయించుకున్నారు. మున్సిపల్ సిబ్బంది వ్యర్థాలను క్రేన్ సహాయంతో తొలగించారు.
Source: Eenadu
ఎడతెరిపి లేని వర్షాలతో కొత్తపల్లి జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. వర్షపునీటితో జలపాతం కొత్తరూపు సంతరించుకుంది. పర్యాటకులను నీళ్లలో దిగేందుకు, అడుగు భాగం వరకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Source: Eenadu
భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం విలీన మండలాల్లో మరోసారి వరద భయం మొదలైంది. ఇప్పటికే మూడుసార్లు వరద ఊళ్లను ముంచెత్తింది. మరోసారి హెచ్చరికలతో నాలుగు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Source: Eenadu
విశాఖ నుంచి పాడేరు వస్తున్న ఆయిల్ ట్యాంకరు పాడేరు ఘాట్‌రోడ్డులో కొమ్మాలమ్మ పనుకు వద్ద శనివారం మధ్యాహ్నం నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలువురు డ్రైవర్లు అక్కడకు చేరుకుని మరమ్మతులు చేయడంతో వాహనం ముందుకు కదిలింది.
Source: Eenadu
చీమకుర్తి పట్టణ సమీపంలో కారుమంచి కాలువకు ముందున్న రహదారి ఇది. గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లకు కార్మికులు, ప్రజలు ఇటుగానే నిత్యం వెళ్తుంటారు. గ్రానైట్ రాళ్లతో వెళ్లే లారీలు సరే సరి. వర్షాలకు ఈ రహదారి దుర్భరంగా తయారైంది.
Source: Eenadu
ముంబయిలోని జుహూ బీచ్ వద్ద వినాయక నిమజ్జనం అనంతరం పోగుపడిన చెత్తను వాలంటీర్లతో కలిసి శుభ్రపరుస్తున్న బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, పరిణీతి చోప్రా.
Source: Eenadu