చిత్రం చెప్పే విశేషాలు!

(16-09-2022/1)

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉద్యోగులు హెల్మెట్‌ పెట్టుకొని విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. 60 ఏళ్ల కిందట నిర్మించిన కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు నుంచి రోజూ పెచ్చులూడుతున్నాయి. ఉద్యోగులకు గాయాలవుతున్నాయి.

Source: Eenadu

నిర్మల్‌-మంచిర్యాల ప్రధాన రహదారి పక్కన బాబాపూర్‌ సమీపంలో కౌలు రైతు బట్టు భీమన్న మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పడుతున్న పాట్లు ఇవి. చేనుకు దగ్గరలో ఎత్తైన చెట్టుపై భీమన్న మంచె తయారు చేసుకొని చిలుకలు, కోతులను తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Source: Eenadu

ఇక్కడ రోడ్డును బాగుచేసే పనిలో నిమగ్నమైన వీరంతా కర్నూలు జిల్లా కుంటనహాల్‌ గ్రామానికి చెందిన విద్యార్థులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతెన మార్గం కోతకు గురవడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 30 మంది విద్యార్థులు రహదారిపై ఇలా చదును చేశారు.

Source: Eenadu

తాగునీటి కాలుష్యం, జన్యుపరమైన సమస్యలతో తీవ్ర వైకల్యాల బారినపడి ఇబ్బంది పడుతున్న వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ గురువారం ఇందిరా పార్కు వద్ద పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కనిపించిన దృశ్యమిది.

Source: Eenadu

గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయనగరంలోని 26వ డివిజన్‌ రంగాలవీధిలో స్థానికులు ఉప్పుతో 30 అడుగుల వినాయకుడి ప్రతిమను తీర్చిదిద్దారు. దాని చుట్టూ మహిళలు 500 దీపాలు వెలిగించి పూజలు చేశారు.

Source: Eenadu

శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘లోటస్‌ టవర్‌’ ఇది. చైనా రుణసాయంతో దాదాపు పదేళ్ల పాటు నిర్మించారు. 1,150 అడుగులు ఎత్తు కలిగిన ఈ భారీ టవర్‌ అబ్జర్వేషన్‌ డెక్‌ను గురువారం నుంచి సందర్శకుల కోసం తెరిచారు.

Source: Eenadu

ఇవి నాటు బాంబుల్లా ఉన్నాయి కదూ.. డెంగీ నివారణలో భాగంగా దోమల లార్వాను అరికట్టేందుకు పాలకొండ నగర పంచాయతీ అధికారులు తయారు చేయిస్తున్న ఆయిల్‌ బాల్స్‌ ఇవి. ఊక, బియ్యం సంచులు, పురితాళ్లకు ఆయిల్‌ పూసి ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయనున్నారు.

Source: Eenadu

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల కేంద్రంలో ఉంటున్న వలివేటి సాంబయ్య ఇంటి ప్రాంగణంలో గోంగూర మొక్కలు 16 అడుగులు ఎత్తు పెరిగాయి. సాధారణంగా ఆరేడు అడుగుల వరకు పెరిగే మొక్కలను ఆయన వృక్షాలుగా చేశారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home