చిత్రం చెప్పే విశేషాలు..!

(07-10-2022/1)

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు చేసే గదీ వర్షానికి కురుస్తోంది. గురువారం ఉదయం ఓ గర్భిణికి ప్రసవం చేయాల్సి ఉండగా గర్భిణి ఉన్న బల్లను ఒక మూలకు చేర్చి.. గదిలో నీరు కారుతున్న చోటల్లా బకెట్లు, బేసిన్లు పెట్టి కాన్పు చేశారు.

Source: Eenadu

ముంబయి-గాంధీనగర్‌ల మధ్య ఇటీవలే ప్రారంభించిన ‘వందే భారత్‌’ రైలు ప్రమాదానికి గురైంది. గురువారం ఓ గేదెల మందను ఢీకొన్న ఘటనలో రైలు ముందు భాగం దెబ్బతింది.

Source: Eenadu

కేరళ మొసంబీ(పుమెల్లో) రకం నిమ్మ జాతి కాయలు ఇవి. తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా పండించే ఈ రకాన్ని పెద్దపల్లిలోని సయ్యద్‌ సాజిద్‌ పండ్ల తోటలో పెంచుతున్నారు. ఒక్కోటి రెండున్నర కిలోల బరువుంటుంది.

Source: Eenadu

సిద్దిపేట పట్టణంలోని ఓ హోటల్‌లో వినూత్న ఈ నీటి పంపిణీ పరికరాన్ని అమర్చారు. వినియోగదారులు పైన ఉన్న మీటను ఒకసారి తాకగానే దాని నల్లా నుంచి నీళ్లు వస్తాయి. నల్లా తిప్పే పని లేదని హోటల్‌ నిర్వాహకుడు మల్లేశ్‌ తెలిపారు.

Source: Eenadu

శిల్పారామంలో గురువారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కనువిందుగా సాగింది. నాట్యగురువు రమాదేవి శిష్యబృందం చూడముచ్చటగా నృత్యం చేసి అందరినీ అలరించారు.

Source: Eenadu

ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జిని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని మెట్రో లైన్‌ పైనుంచి వెళ్లేలా ఎత్తుగా నిర్మిస్తున్నారు. భారీ క్రేన్లతో రాత్రుళ్లు పనులు జరుగుతున్నాయి.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హకీంపేటలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ 30వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బలగాలు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.

Source: Eenadu

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని కొన్ని రోజులపాటు అట్టుడికించిన ఇయన్‌ హరికేన్‌ ఎట్టకేలకు శాంతించింది. దీంతో వివిధ పట్టణాలు, ఐలాండ్లలో తీవ్రంగా దెబ్బతిన్న నివాసాలు, కార్లు, బోట్లను బాధితులు మరమ్మతులు చేసుకుంటూ కనిపించారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home