చిత్రం చెప్పే విశేషాలు!
(17-10-2022/2)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు సోమవారం పోలింగ్ జరిగింది. కర్ణాటకలో ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బళ్లారిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Source: Eenadu
విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది. పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు నోవాటెల్ వద్దకు వచ్చే జనసేన నేతలు సహా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు.
Source: Eenadu
తెరాసకు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ త్వరలో భాజపా గూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దోమలగూడలోని బూర నర్సయ్యగౌడ్ నివాసానికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయ్యారు.
Source: Eenadu
కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో రామ్‌జల చెరువు నిండి జలకళ సంతరించుకుంది. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు తరలివచ్చి అందులో ఈత కొడుతూ సందడి చేశారు.
Source: Eenadu
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గామన్ వంతెన వద్ద గోదావరి నదిలో పడవలపై అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతున్న మత్స్యకారులు.
Source: Eenadu
విష్వక్‌సేన్, విక్టరీ వెంకటేశ్, మిథిలా పార్కర్, ఆశా భట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
Source: Eenadu
ఆస్ట్రేలియాలో భారీవర్షాలతో వరదలు ముంచెత్తాయి. అక్కడి విక్టోరియా రాష్ట్రంలో సుమారు 34వేల ఇళ్లు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. షెప్పర్టన్ పట్టణంలో కార్లు నీటమునిగిన ఫొటోను చిత్రంలో చూడవచ్చు.
Source: Eenadu
పారిస్‌లో నిర్వహించిన కార్ షోలో అధునాతన సాంకేతికత కలిగిన కార్లను ప్రదర్శనకు ఉంచారు. అక్కడ ఎగ్జిబిషన్‌లో ఉంచిన ది ప్యూజియట్ 9X8 హైబ్రిడ్ హైపర్ కార్, రెనాల్ట్ ఫరెవర్ ట్రోఫీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను చిత్రంలో చూడవచ్చు.
Source: Eenadu
దుబాయిలోని గ్యాలరీలో 303.10 క్యారెట్ల వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు వజ్రంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని డిసెంబర్ 7న న్యూయార్క్‌లోని సోత్బే ఆక్షన్ హౌస్‌లో వేలం వేయనున్నారు. ఇది వేలంలో 15మిలియన్ డాలర్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు.
Source: Eenadu