చిత్రం చెప్పే విశేషాలు!

(23-10-2022/1)

ప్రవాహంలో కొట్టుకుపోకుండా చెరువులోనే ఉండేందుకు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్న చేపకు.. పైకి వస్తే గుటుక్కున మింగేస్తా అని కాచుకుని ఉన్న కొంగ కనిపించింది. దీంతో కత్వా పైకి ఎక్కకుండానే మత్స్యం కిందికి జారిపోయింది. నల్గొండ జిల్లా మునుగోడు శివారులో కనిపించిందీ దృశ్యం.

Source:Eenadu

హైదరాబాద్‌ నగరంలో వాహనదారులకు కొత్త నిబంధనలు రావడంతో ట్రాఫిక్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా నంబర్‌ ప్లేట్లు సరిగా లేనివారికి, చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి పట్టుబడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Source:Eenadu

ఏపీలో గ్రామీణ రోడ్లే కాదు. రాష్ట్ర రహదారులూ దారుణంగా మారాయి. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం సమీపంలో రోడ్డుపై లోతైన గుంత ఏర్పడింది. ఏ అధికారి పట్టించుకోకపోవడంతో స్థానికులే ఓ మొద్దును అందులో వేశారు.

Source:Eenadu

నిజాంపేట నగరపాలిక పరిధిలోని బాచుపల్లి ప్రధాన రోడ్డు పరిస్థితి ఇది. కొన్ని నెలలుగా రోడ్డుపై మురుగు పొంగి నిలిచిపోవడంతో నాచు పేరుకుపోయింది అధికారులు సైతం పట్టించుకోకుండా వదిలేయడంతో దుర్వాసన, దోమలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

Source:Eenadu

వైకుంఠ చతుర్దశి సందర్భంగా కార్తిక సోమవారం నవంబరు 7న తెలంగాణ రాష్ట్రంలోని 10 వేల దేవాలయాల్లో కోటి దీపాలను వెలిగించేందుకు నిర్మల్‌లో వీహెచ్‌పీ గోరక్ష విభాగం కోటి గోమయ ప్రమిదలను తయారు చేసింది.

Source:Eenadu

బాచుపల్లిలోని విఎన్‌ఆర్‌ కళాశాల వద్ద బస్టాప్‌ ఇది. ఇక్కడ ఉన్న బస్‌ రూట్‌ బోర్డు, కూర్చోవడానికి సీట్లు కూడా కనిపించకుండా చెట్ల గుబురు కప్పేసింది. వందలాది విద్యార్థులు బస్సుల కోసం వేచి చూసే ఇక్కడ ఇలా ఉండటంతో ఏ బస్సులు ఆగుతాయో తెలియక విద్యార్థులు తికమక పడుతున్నారు.

Source:Eenadu

దీపావళి పర్వదినం నేపథ్యంలో గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌కు వివిధ రకాల పూలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. ఇదే సమయంలో పాడైన పూలు చెత్తకుప్పల్లోకి చేరిపోతున్నాయి. మార్కెట్‌లో సంచరించే గేదెలు ఈ కుప్పల్లోని పూలపై ఇలా సేదతీరుతూ కనిపించాయి.

Source:Eenadu

శిల్పారామంలో శనివారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కనువిందుగా సాగింది. ప్రశాంత్‌ కందుల శిష్యబృందం ప్రదర్శించిన మహిషాసురమర్దిని, శివతాండవం, జయజయదుర్గే నృత్యాంశాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Source:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home