చిత్రం చెప్పే విశేషాలు!
(13-02-2023/1)
కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (1,386 కి.మీ.) లో 246 కి.మీ. మొదటి దశ సోహ్నా-దౌసా రహదారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాజస్థాన్‌లోని దౌసాలో ప్రారంభించారు.
Source.. Eenadu
చెట్టంతా పూలతో అలంకరించినట్టుగా ఉంది కదూ.. ఇది మామిడి చెట్టు. ఆకులు కనిపించనంతగా ఈ చెట్టుకు మామిడి పూత పూసింది. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ శంకరాపురంలోని మామిడితోటలో విరగపూసిన ఈ చెట్టు ఆకర్షణీయంగా కనిపిస్తూ అటుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది.
Source.. Eenadu
హైదరాబాద్ నగరంలో వివిధ దుకాణాల వారు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వినూత్న రీతుల్లో అలంకరణలు చేస్తున్నారు. కొత్తగూడ వద్ద ఉన్న ఓ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈఫిల్ టవర్ ఇది. సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.
Source.. Eenadu
ఆదివారం నల్గొండలోని నీలగిరిలో ఓ వాహనదారుడు స్కూటిపై సామర్థ్యానికి మించి ఐదుగురు ప్రయాణించారు. అదుపు తప్పితే ప్రమాదమేనంటూ తోటి వాహనదారులు హెచ్చరించారు.
Source.. Eenadu
తూర్పుగోదావరి జిల్లాలోని సద్గురు శ్రీచిట్టిబాబాజీ సంస్థానానికి చెందిన ఏనుగు(లీల) రోజూ ఉదయం పూట ఊరంతా షికారు చేస్తూ ముందుకొచ్చి భక్తులను తన తొండంతో దీవిస్తుంది. ఆ సమయంలో కొంతమంది పండ్లు, కూరగాయలు అల్పాహారంగా పెడతారు.
Source.. Eenadu
మల్కాజిగిరి డివిజన్ చాణక్యపురికి చెందిన ప్రమోద్ కుమార్ ఆటో డ్రైవర్. తనకు ఉపాధి కల్పిస్తున్న ఆటోను ప్రాణంగా చూసుకుంటారు. పలు రకాల మొక్కలను ఆటోలో పెంచుతున్నారు. తీగ జాతితో పాటు మందార తదితర మొక్కలు ఉన్నాయి.
Source.. Eenadu
ఇంటి ముందో, పెరట్లో పెంచే మొక్కలు కావివి. కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో పెంచుతున్నవి. అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి అక్కడి ఆయుర్వేద వైద్యులు వీటిని చూపిస్తూ ఏ చెట్టుతో ఆరోగ్యం బాగుపడుతుందో వివరించి మందులు అందజేస్తున్నారు.
Source.. Eenadu
పార్వతీపురం మన్యం జిల్లాలోని రాజాం మండలం బొమ్మినాయుడువలసలో అంగన్వాడీ కేంద్రం వద్ద చెట్టుకు విద్యుత్తు మీటరు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
Source.. Eenadu