చిత్రం చెప్పే విశేషాలు..! (25-09-2023/1)
తెదేపా అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యే వరకూ ఆ పార్టీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగనున్నాయి. ఆదివారం చిత్తూరులో తెదేపా బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్ష చేశారు. శ్రీకృష్ణదేవరాయల వేషధారణతో, చెవిలో పువ్వులతో వినూత్నంగా నిరసన తెలిపారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి రామకృష్ణ గోవింద అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఎండుఫలాలు, గాజులు, ముత్యాలతో కిరీటాలు చేసి అలంకరించారు.
వినాయక చవితిని పురస్కరించుకొని పలు చోట్ల గణనాథుల ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం చాకలిపాలెంలో బొమ్మల కొలువుతో ఏర్పాటు చేసిన ఉయ్యాల గణపతి భక్తులను కనువిందు చేస్తున్నారు.
విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం మిసెస్ వైజాగ్-2023 పేరుతో అందాల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పోటీల్లో పాల్గొని ర్యాంప్‌వాక్ చేశారు. అక్టోబర్ 8న గ్రాండ్ ఫినాలే పోటీలు జరుగుతాయన్నారు.
మూడు రోజులుగా మారిన వాతావరణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో ఊటీని తలపిస్తోంది. చిరు జల్లులతో పాటు మధ్యలో హోరుగాలులు, వర్షం కురుస్తోంది. ఉదయం వేళ పలు చోట్ల మేఘాలు కొండలను తాకుతూ చూపరులను ఆకట్టుకుంటోంది.
నగర వీధులన్నీ గణపతి నామస్మరణతో మారుమోగాయి. వారం రోజులుగా పూజలందుకున్న లంబోదరులను భక్తులు ఆదివారం నిమజ్జనానికి తరలించారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. చెరువులు, కొలనుల వద్ద సందడి వాతావరణం కనిపించింది.
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయానికి ఆదివారం చంద్రముఖి-2 చిత్ర బృందం విచ్చేసింది. చిత్ర దర్శకుడు పి.వాసుతోపాటు నటి కంగనా రనౌత్, నటుడు రాఘవ లారెన్స్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ఉన్న భక్తులు కంగనాతో ఫొటోలు దిగారు.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వెంకటాపురం మండలంలోని ముత్తారం జలపాతం కనువిందు చేస్తోంది. ఎత్తయిన గుట్ట నుంచి పాల నురగ జాలువారుతుందా అన్నట్లు జలధార పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తోంది.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లంబోదరుడికి 137 రకాల నైవేద్యాలను సమర్పించారు. భూపాలపల్లి పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన గణపతి పూజలో ఈ నైవేద్యాలు పెట్టారు.