చిత్రం చెప్పే విశేషాలు.. (27-09-2023/1)

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలోని ఆశీలుమెట్ట సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో మంగళవారం స్వామివారు శివ కుటుంబ వినాయకుడిగా దర్శనమిచ్చారు. ఈ ఏడాది వినూత్న రీతిలో వినాయకుడ్ని అలంకరిస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శనాలకు తరలివస్తున్నారు.

నిజామాబాద్‌లోని దట్టమైన మల్లారం అడవిలో ఉన్న మష్రూంరాక్‌(కుక్కగొడుకు రాయి) ఆకట్టుకుంటోంది. గతంలో ఈ రాయి పరిసరాలను ఉద్యానవనంగా తీర్చిదిద్ది మార్గాన్ని కూడా నిర్మించారు. తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయింది.

తమిళనాట పుట్టి... తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టి.. హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి వహీదా రెహమాన్‌ (85). సినీ ప్రేక్షకుల్ని అలరించి, చిత్రసీమకు ఆమె చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును మంగళవారం ప్రకటించింది.

పంజాబ్‌లోని బఠిండాకు చెందిన ఓ విద్యార్థిని.. ఒకటి నుంచి 50 మ్యాథ్స్‌ క్యూబ్‌లను రెండు నిమిషాల్లోనే చెప్పేస్తోంది. తన అరుదైన ప్రతిభతో ఇప్పటికే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన బాలిక.. తాజాగా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ తన పేరును లిఖించుకుంది.

మల్కాజిగిరి భారాస పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇక్కడి అభ్యర్థిగా ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావును ప్రకటించగా.. ఆయన భారాసకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

కర్నూలులోని పాతబస్తీ రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం లడ్డూ వేలం నిర్వహించారు. భాజపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ బైరెడ్డి శబరి రూ. 2.06లక్షలకు లడ్డును దక్కించుకున్నారు.

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం మొదటి రోజున 236 మంది ప్రయాణికులతో బయలుదేరి వెళ్లింది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకతో ప్రతి శనివారం ఉండే కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (16570) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

కాకినాడ జిల్లాలోని నీలపల్లిలో తెదేపా శ్రేణులు ‘బాబుతో నేను’ ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాయి. ‘నా పెద్ద కొడుకు లాంటి చంద్రబాబును అరెస్టు చేసినప్పట్నుంచి నిద్ర, ఆకలి ఉండడంలేదు’అంటూ స్థానికంగా ఉండే వృద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

చిత్రం చెప్పేవిశేషాలు(09-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

Eenadu.net Home