చిత్రం చెప్పే విశేషాలు..! (08-10-2022/1)

గంగను తలపై మోసే శివుడు ఇక్కడ మాత్రం గంగమ్మ ఒడిలోనే సేద దీరుతున్నాడు. సంగారెడ్డి పట్టణం సోమేశ్వరవాడలోని శివాలయం ప్రత్యేకత ఇది. గతంలో వర్షా కాలంలో మూడు నెలలు మాత్రమే ఆలయం నీటితో నిండి ఉండేది. మూడేళ్లుగా జంగమయ్య గుడిని గంగమ్మ వదలడంలేదు.

#Eenadu

విశాఖ నగర పరిధిలోని భీమిలి వద్ద సాగర్‌ జలాలు శుక్రవారం రంగుమారాయి. వరుస వర్షాలకు కొత్తగా చేరుతున్న నీటి వల్ల కడలిలోని నీరు మట్టి రంగులో కనిపించాయి. నీలి వర్ణంలో కనువిందు చేసే సముద్రం ఇలా రంగు మారడంతో బీచ్‌కు వచ్చిన సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు.

#Eenadu

ఈ చిత్రం చూస్తుంటే పచ్చటి ప్రకృతి నడుమ కదిలే రైలును తలపిస్తోంది కదూ. కానీ ఇది పరుగెత్తేది కాదు. ఓ చిత్రకారుడి కళా కౌశలం ఇది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే లాలాగూడలోని ప్రధాన రహదారులపై రైలు బొమ్మల త్రీడీ చిత్రాలను గీయించింది.

#Eenadu

పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఈసీ వాగు ద్వారా పెద్ద ఎత్తున ప్రవాహం హిమాయత్‌సాగర్‌లోకి చేరుతోంది. జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ జాగీర్‌ సమీపంలో ఈసీ వాగు జలపాతాన్ని తలపిస్తోంది.

#Eenadu

హైదరాబాద్‌ నగరంలో పేరుగాంచిన నిమ్స్‌ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద పరిస్థితి ఇది. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడ భారీ మడుగు ఏర్పడడంతో రోగులు, వారి సహాయకులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

#Eenadu 

హైదరాబాద్‌ నల్లకుంటలోని పద్మ కాలనీలో నాలా పనులు ప్రారంభించి ఆరు నెలలు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కాలనీ వాసులు వాపోతున్నారు.

#Eenadu 

నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని తెల్లపులి పిల్లలు శుక్రవారం మూడో వసంతంలోకి అడుగుపెట్టాయి. అవి పూర్తి ఆరోగ్యంతో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

#Eenadu

విశాఖలోని సాగర్‌నగర్‌ తీరానికి శుక్రవారం మృతి చెందిన ఓ ముళ్లకప్ప కొట్టుకొచ్చింది. వీటిని పఫర్‌ ఫిష్‌గా పిలుస్తారు. ఇవి సముద్ర జలాల్లో చాలా లోపల ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోరని, చేపల వేటలో వలకు చిక్కినా సముద్రంలోనే వదిలేస్తామని స్థానిక మత్స్యకారులు తెలిపారు.

#Eenadu

గతేడాది నవంబర్‌లో అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయి నీరంతా ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత వర్షాలకు ఆ ప్రాజెక్టు గర్భంలో నీటి ఊట పారుతోంది. బంగారు వర్ణంలోని ఇసుకపై పలుచటి పొరలా పారుతున్న ఊట సూర్య కిరణాలకు వెండిలా మెరుస్తోంది.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home