చిత్రం చెప్పే విశేషాలు..! (29-10-2022/1)
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ పురపాలిక పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో అతిథి గృహంపై వైవిధ్యమైన ఆకృతిలో నీటి ట్యాంకుని నిర్మించారు. భవనానికి ఉన్న పిల్లర్ల ఆసరాతో ఏ మాత్రం స్థలం వృథా కాకుండా 90వేల లీటర్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు.
#Eenadu
ఉల్క ఢీ కారణంగా అంగారక గ్రహంపై అమెజోనిస్ ప్లానిషియా ప్రాంతంలో ఏర్పడ్డ బిలం. దాని అంచుల్లో మంచు రూపంలో నీటి జాడ స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన మార్స్ రికానసెన్స్ ఆర్బిటర్ ఉపగ్రహం ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించింది.
#Eenadu
నెలవంక చంద్రుడు హైదరాబాద్‌లోని బిర్లామందిర్ చెంత తళుక్కుమన్నాడు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో గోపురం సమీపానికి చేరినట్లు కనిపించి చూపరులను ఆకట్టుకున్నాడు.
#Eenadu
దక్షిణ లండన్‌లోని క్రొయ్‌డన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న శ్రీజ గోపాలన్ అనే మహిళతో శుక్రవారం సెల్ఫీ తీసుకుంటున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.
#Eenadu
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ విజయవాడ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఆయుధ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు పాల్గొని వాటిని ఆసక్తిగా తిలకించారు. తుపాకులు ఎక్కుపెట్టి ఒకరికొకరు చూసుకుంటూ ఆనందం పొందారు.
#Eenadu
బాల్యం నుంచి ప్రధానమంత్రి వరకు నరేంద్రమోదీ ఎదిగిన క్రమం.. ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావాలపై ప్రముఖ చిత్రకారుడు అక్బర్ సాహెబ్ చిత్రించిన వర్ణ చిత్రాల ప్రదర్శనను దిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
#Eenadu
నెల్లూరు: జాతీయ రహదారి గొలగమూడి చౌరస్తా వద్ద ఎఫ్.సి.ఐ. గిడ్డంగుల వద్ద గత నాలుగు రోజులుగా ధాన్యం దించడం లేదు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లారీ డ్రైవర్లు సరకుకు పట్టలు కప్పి అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
#Eenadu
ఇటీవల వర్షాలకు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో అంబర్‌పేట వంతెన పైనుంచి నీళ్లు ప్రవహించి రక్షణ గోడలు కొట్టుకుపోవడంతో వాటి స్థానంలో డ్రమ్ముల్లో ఇసుక పోసి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అవి ఓ వైపు కనిపించడం లేదు. రాత్రి వేగంగా వచ్చేవారు ప్రమాదానికి గురయ్యే అవకాశముంది.