చిత్రం చెప్పే విశేషాలు..!
(26-08-2022/1)
అన్నమయ్య జిల్లాకి చెందిన రైతు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎకరా భూమిలో క్యారెట్ రంగులో ఉండే చిలగడదుంపను పండిస్తున్నారు. ఒక్కో గడ్డ కిలో వరకు బరువు వస్తోంది. ఆకర్షించే రంగుతోపాటు రుచికరంగా ఉండటంతో రైతు నుంచి కొనుగోలుకు వ్యాపారులు సైతం ఆసక్తి చూపుతున్నారు.
Source: Eenadu
విద్యుత్తు తీగలకు కర్ర స్తంభాలు వాడుతున్న ఈ వీధి ఎక్కడో మారుమూల పల్లెలోనిది కాదు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటి వెనుకాలే ఉంది. చిన్నపాటి గాలులు వీచినా సరే కర్రలు పడిపోయే ప్రమాదం ఉంది.
Source: Eenadu
వ్యర్థాలతో నిండి, నాచు పట్టిన ఈ కోనేరు నంద్యాల జిల్లాలోని అతిపురాతన వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలోనిది. ఉత్సవాల సమయంలో నామమాత్రపు చర్యలు మినహా ఆ తర్వాత కోనేర్లను పట్టించుకోవడం లేదు.
Source: Eenadu
అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో వినాయక ఉత్సవాలు నిర్వహించే యువకులు ‘భద్రాచలం - రాజమండ్రి’ ప్రధాన రహదారిపై తాడు అడ్డుగా పెట్టి వాహనదారుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. కొందరి వద్ద నగదు లేక పోవడంతో.. పేటీఎం ద్వారానూ సేకరించారు.
Source: Eenadu
ఇటీవల దివ్యాంగులకు బాటరీ సాయంతో కదిలే వీల్‌ఛైర్లను అందించారు. చాలామంది బైక్‌పై వేగంగా వెళ్తున్నా శిరస్త్రాణం ధరించడం లేదు. ఇందుకు భిన్నంగా మణుగూరు ప్రధాన రహదారిపై ఓ దివ్యాంగుడు హెల్మెట్ ధరించి వీల్‌ఛైర్ నడిపిస్తున్న దృశ్యమిది.
Source: Eenadu
ఈ చిత్రం చూస్తే ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అమితంగా ఇష్టపడే అసోం టీ తోటలను తలపిస్తున్నాయి కదూ. కానీ ఇవి గాంధారి మండలంలోని పంట పొలాలు. వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతమంతా పచ్చటిదుప్పటి కప్పుకొంటుంది.
Source: Eenadu
పొన్నూరు సమీపంలోని నిడుబ్రోలు సమీపంలోని జగనన్న కాలనీ నీట మునిగి చెరువును తలపిస్తోంది. పొలాల మధ్య ఉన్న ప్రాంతం కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఇలా జలమయంగా మారింది. వారాలు గడుస్తున్నా ఇలాగే ఉండడంతో అసలే నత్తనడకలా జరిగే పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
Source: Eenadu
కృష్ణా జిల్లా పెడనలో జరిగిన నేతన్న నేస్తం సభకు వచ్చి సమస్యలను సీఎంతో చెప్పుకోవడానికి అర్జీదారులు జనం మధ్యలో నుంచి సీఎం సార్ అని గట్టిగా అరిచారు. దీంతో వారి ఆర్జీలను స్వీకరించాలని కలెక్టర్‌ను వారి వద్దకు పంపించారు.
Source: Eenadu
ఇటీవల ఇసుక లభ్యత కష్టంగా మారడంతో కొందరు హంద్రీ నదిలో ఇసుక తోడుకుంటున్నారు. కర్నూలు నగరంలోని ఆనంద్ టాకీస్ వద్ద కేసీ వంతెన దిగువన దున్నపోతుల మీద ఇసుకను తరలిస్తున్నారు. హంద్రీలో మురుగు పారుతున్నా అందులోనే మునిగి ఇసుక తీస్తున్నారు.
Source: Eenadu