హార్దిక్‌తో డేటింగ్‌ రూమర్‌.. అసలెవరీ జాస్మిన్‌ వాలియా!

భారత స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ తమ వివాహబంధానికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

అప్పటినుంచి ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్నాడు పాండ్య. ప్రస్తుతం బ్రిటిష్ సింగర్‌ జాస్మిన్‌ వాలియాతో డేటింగ్‌ అంటూ నెట్టింట్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. 

వీళ్లిద్దరూ కలిసి విహారయాత్రకి వెళ్లినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. గ్రీస్‌లోని ఓ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద తీసుకున్న వీరి ఫోటోలు వైరలవుతున్నాయి. దీంతో నెటిజన్ల దృష్టి జాస్మిన్ వైపు మళ్లింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌ ప్రాంతానికి చెందిన జాస్మిన్‌ వాలియా 2010లో టీవీలో నటిగా అరంగేట్రం చేసి, ‘ది ఓన్లీ వే ఈజ్‌ ఎసెక్స్‌’ అనే సిరీస్‌తో అభిమానులకు మరింత చేరువైంది.

ఆరేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించిన జాస్మిన్‌ టీవీలో సినిమాలు చూస్తూ వాళ్లలాగే నటించేదట. అలా సంగీతంపై తనకి ఏర్పడిన ఇష్టాన్ని గుర్తించి వాళ్ల నాన్న సంగీత పాఠశాలలో చేర్పించారట. 

కెరియర్‌ ఆరంభంలో నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో కస్టమర్ అడ్వైజర్‌ గా పనిచేసిన ఈమె తర్వాత పూర్తిగా సంగీతాన్నే కేరీర్‌గా ఎంచుకుంది.

భారత సంతతికి చెందిన జాస్మిన్‌ 2014లో తన పేరుతోనే యూట్యూబ్‌ ఛానల్ ప్రారంభించి పలు అల్బమ్‌లు చేసింది.

జాస్మిన్‌ చేసిన ‘బామ్‌ డిగీ డిగీ’ పాట ప్రేక్షకుల ఆదరణ పొంది మిర్చి మ్యూజిక్‌ అవార్డుకు నామినేట్‌ అయింది.

‘సింగర్‌గా పాటలు బాగా పాడటం ఎంత ముఖ్యమో, అందంగా తయారవ్వడం కూడా అంతే ముఖ్యం. స్టేజ్‌పై ఎంతో మంది ముందు పాడాల్సి వస్తుంటుంది. కాబట్టి నేను ఫ్యాషన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అంటుందీ బ్యూటీ.

ఆసిమ్‌ రియాజ్‌తో కలిసి నటించిన ఓ మ్యూజిక్‌ వీడియోకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అంతేనా, ఆ వీడియో ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌ బిల్‌బోర్డులో ప్రదర్శనకి ఎంపికై.. మొట్టమొదటి భారత సంతతి బ్రిటిష్‌ మహిళా సింగర్‌గా చరిత్ర సృష్టించింది జాస్మిన్‌.

ఈమెకి ఇండియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టమట. అందులోనూ పానీపూరీ మరీ ప్రత్యేకం. ముంబయి వీధుల్లో విహరిస్తూ తనకిష్టమైన ఆహారం తింటూ చిల్‌ అవుతానంటుందీ అమ్మడు.

సోషల్‌ మీడియా స్టార్‌గా, పాపులర్‌ సింగర్‌గా ఎదిగిన జాస్మిన్‌ వాలియాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4లక్షలు, యూట్యూబ్‌లో 5.7లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.

టెస్టుల్లో రాహుల్‌ ద్రవిడ్ తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీరే!

ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు క్యాచ్‌లు పట్టిన వారి జాబితా ఇదే!

పారాలింపిక్స్‌.. చరిత్రలో ‘ఫస్ట్’ పతక వీరులు

Eenadu.net Home