ఆర్థిక విజయానికి 8 థంబ్‌ రూల్స్‌

ప్రతి ఒక్కరికీ భవిష్యత్‌ లక్ష్యాలుంటాయి. డబ్బు ఆదా చేయాలని, ఇల్లు కొనాలని, పదవీ విరమణ అనంతర జీవితం హాయిగా గడపాలని కోరుకుంటారు. మరి ఈ గమ్యాన్ని చేరుకోవాలంటే.. ఎంత సంపాదిస్తున్నామనే విషయంతో సంబంధం లేకుండా తెలివిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దాని కోసమే ఈ థంబ్‌ రూల్స్‌..

72తో డబ్బు డబుల్‌

పొదుపు చేసే డబ్బు ఎంత సమయంలో రెట్టింపవుతుందో తెలిపే రూల్‌ ఇది. మీ పెట్టుబడిపై అందిస్తున్న వడ్డీ శాతాన్ని 72తో భాగించాలి. అలా వచ్చిన సంఖ్య మీ డబ్బు ఎన్నేళ్లలో డబుల్‌ అవుతుందో చెప్పేస్తుంది. (72/6= 12)

50-30-20 రూల్‌

నెలవారీ వచ్చే జీతంలో 50 శాతం ఇంటి అవసరాలకు, 30 శాతం విలాసవంతమైన ఖర్చులకు, మిగిలిన 20 శాతం నచ్చిన వాటిల్లో పెట్టుబడులు చేయండి. లక్ష్యాలను బట్టి పొదుపు శాతాన్ని పెంచుకుంటూ పోవచ్చు.

100 మైనస్‌ ఏజ్‌ రూల్‌

ప్రస్తుతం ఉన్న మీ వయసును 100లో తీసేయాలి. ఉదా: 100-30 = 70. అంటే మీరు సేవ్‌ చేసే మొత్తంలో 70 శాతాన్ని ఈక్విటీలో పెట్టుబడి చేయాలి. మిగిలిన డబ్బును డెట్‌ ఫండ్స్‌లో పెట్టొచ్చు. ఈక్విటీ ఫండ్స్‌ రిస్క్‌ ఎక్కువ. అందుకే వయసు పెరిగే కొద్దీ పెట్టే మొత్తం తగ్గుతుంది.

ఎమర్జెన్సీ ఫండ్‌ 

ప్రతి నెలా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని అత్యవసర సమయాల్లో ఆదుకోవటానికి సేవ్‌ చేయాలి. మీ నెలవారీ జీతానికి 3 నుంచి 6 రెట్ల మొత్తాన్ని పొదుపు చేయాలి.

40% ఈఎంఐ

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మందికి ఉపయోగపడే రూల్‌ ఇది. వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి ఈఎంఐలు ఉండకూడదన్నది ఈ రూల్‌ ఉద్దేశం.

ఇన్సూరెన్స్‌ రూల్‌

ఎంత మొత్తంలో బీమా కోసం వెచ్చించాలో చెప్పే రూల్ ఇది. వ్యక్తి సంవత్సర ఆదాయానికి 20 రెట్ల మొత్తంలో జీవిత బీమా ఉండాలని ఆర్థిక సలహాదారులు చెబుతుంటారు.

వారం ఛాలెంజ్‌

అవసరంతో పనిలేకుండా వస్తువుల్ని కొనే అలవాటు పోవాలంటే వారం ఛాలెంజ్‌ స్వీకరించండి. కొనాలకుకున్న ప్రతి వస్తువును కార్ట్‌లో యాడ్‌ చేసి వారం రోజులు ఉంచండి. వారం తర్వాత కూడా ఆ వస్తువు అవసరం అనుకుంటేనే కొనుగోలు చేయండి.

సొంతిల్లా.. అద్దె ఇల్లా..?

కొనుగోలు చేయాలనుకుంటున్న ఇంటి ధర కంటే అద్దె ఇంట్లో ఏడాదికి చెల్లిస్తున్న మొత్తం 4 శాతం మించితే ఇంటిని కొనుగోలు చేయడమే మేలు.

ఎఫ్‌ అండ్‌ ఓ కొత్త రూల్స్‌ తెలుసా..?

ఈవీల సబ్సిడీకి కొత్త పథకం

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే!

Eenadu.net Home