చైతన్యకు కాబోయే సతీమణి శోభిత.. తెలుగమ్మాయే
‘గూఢచారి’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన శోభిత ధూళిపాళ్ల ఆ తర్వాత ‘మేజర్’, ‘కురుప్’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
శోభిత తెలుగమ్మాయే. ఆమె పుట్టింది తెనాలి. పెరిగింది మాత్రం వైజాగ్‌లో.. తండ్రి వేణుగోపాల్ రావ్ మర్చంట్ నేవీలో పనిచేశారు. తల్లి శాంతారావ్ టీచర్.
ఎకనమిక్స్ సబ్జెక్ట్ శోభితకు ఇష్టం. ఇంటర్ అయ్యాక చదువుకోసం ముంబయి వెళ్లింది. శోభిత స్నేహితురాలు ఆమెకు చెప్పకుండా మిస్ ఇండియా పోటీలకు పేరిచ్చింది
శోభిత 2013 మిస్ ఇండియా రన్నరప్. అయినా, అవకాశాల కోసం సగటు యువతిలానే ఫొటోలు పట్టుకుని క్యాస్టింగ్ డైరెక్టర్ల చుట్టూ తిరిగింది.
శోభిత ప్రకటనలు చూసి, అనురాగ్ కశ్యప్ ‘రమణ్ రాఘవ 2.0’లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించారు.
ఎన్ని సినిమాలు చేసినా ‘గూఢచారి’ శోభితకు ఎంతో ప్రత్యేకమట. ఆ సినిమా చూసి వాళ్లమ్మ ఎంతో సంతోషించారట.
భారతీయ సినిమాల్లోనే కాదు, హాలీవుడ్‌లోనూ శోభిత తనదైన ముద్రవేసింది. దేవ్ పటేల్‌తో కలిసి ఆమె ‘మంకీ మ్యాన్’లో నటించింది.
శోభితకు భక్తి ఎక్కువ. ఉదయాన్నే పూజ చేస్తుంది. రోజూ సూర్యాష్టకం చదువుతుందట. వీలు కుదిరినప్పుడల్లా ఆలయాలను సందర్శిస్తుంది.
ఇక తన వంట కూడా తనే చేసుకుంటుంది. పూర్తిగా శాకాహారి. బయట తినడాన్ని పెద్దగా ఇష్టం పడదు. ఇంట్లో పనులకి ఎవరి మీదా ఆధారపడకుండా చేసుకుంటుంది.
చిన్నప్పటి నుంచి నవలలూ, హారీపోటర్ పుస్తకాలు బాగా చదివేదట. భరతనాట్యం, గిటార్ కూడా నేర్చుకుందట.
తనయుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం జరిగినట్లు నాగార్జున స్వయంగా ప్రకటించారు. నూతన జంటకు అభినందనలు తెలిపారు.