ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని వేడి చేస్తున్నారా..
సమయం లేక ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం వండి.. ఫ్రిజ్‌లో పెడుతుంటారు. తినేముందు వాటిని వేడి చేసుకుంటారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పదనుకుంటే ఈ సూచనలు పాటించమంటున్నారు.
(photos:unsplash)
ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినే పదార్థాలను ముందే తీసి బయట పెట్టుకోవాలి. అవి రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత.. వేడి చేసుకోవాలి. అంతేగానీ ఫ్రిజ్‌లో నుంచి తీసి నేరుగా స్టవ్ మీద వేడి చేయకూడదు.
కూరగాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది. ఎక్కువ సమయం అవి ఫ్రిజ్‌లో ఉంటే.. వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి. రుచిలోనూ తేడా వచ్చేస్తుంది.
రెడీమేడ్ చపాతీలు, పరాటాలు, పూరీలు లేదా ముందు రోజు రాత్రే కలిపి పెట్టిన పిండిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే అవి విషతుల్యంగా మారే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు తెచ్చుకొని/కలుపుకొని చేయడం మంచిది.
ఫ్రిజ్ డోర్‌ను పదే పదే ఓపెన్ చేస్తుంటే బయటి గాలి లోపలికి చొరబడుతుంది. దీంతో నిల్వ ఉంచిన ఆహారం పాడయ్యే అవకాశముంది. ఫ్రిజ్ డోర్ తీసినప్పుడు క్లోరోఫ్లోరోకార్బన్ విడుదలవుతుంది. ఇది ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. అందుకే, ఫ్రిజ్‌ను వీలైనంత తక్కువ ఉపయోగించాలి.
కూరలు ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు దానికోసం కేటాయించిన కంటైనర్‌లో మాత్రమే పెట్టాలి. వండిన ఆహారం కూడా మూతలు బిగుతుగా ఉన్న డబ్బాల్లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. అప్పుడే అవి తాజాగా ఉంటాయి.
ఉడికించిన గుడ్డు, మాంసం ఫ్రిజ్‌లో నిలువ ఉంచడం వల్ల అవి వాటి రుచిని కోల్పోతాయి. మాంసం ముక్కలు రుచిపచిలేకుండా గట్టిగా తయారవుతాయి. కాబట్టి వీటిని తక్కువ పరిమాణంలో వండుకుని అప్పటికప్పుడే తినాలి.
ఏ పదార్థాన్నైనా వేడిగా ఉన్నప్పుడు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ముందు ఆ పదార్థం రూమ్ టెంపరేచర్‌కి రానివ్వాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.