నవతరం తల్లిదండ్రులకు సుధామూర్తి సలహాలు

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలే అధికం. కొత్తగా వివాహం జరిగి పిల్లల్ని సాకే వారికి.. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పుట్టెడు సలహాలిచ్చేవారు.

ఆధునిక ప్రపంచంలో కుటుంబాలు చిన్నవిగా మారడమే కాదు.. చింతలూ ఎక్కువయ్యాయి. పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది.

అలాంటి వారికి రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా పేరొందిన సుధామూర్తి పలు సందర్భాల్లో పంచుకున్న పేరెంటింగ్‌ టిప్స్‌ మీ కోసం..

మార్కులే ప్రామాణికం కాదు

చదువులో మార్కులు ముఖ్యమే. అలాగని అవే ప్రామాణికం కాదంటారు సుధామూర్తి. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కుల ఒత్తిడికి గురి చెయ్యొద్దంటారు. వారిని దండించడం కాకుండా చదివేలా ప్రోత్సహించాలన్నారు.

సింప్లిసిటీ

చీరకట్టులో సింప్లిసిటీకి నిలువెత్తు రూపంగా కనిపించే సుధామూర్తి.. పిల్లలకూ అదే అలవాటు చేయాలంటారు. చిన్న చిన్న ఆనందాలను పిల్లలకు పరిచయం చేయాలి. ఉన్నదానితో సంతృప్తి చెందడం ఎలానో నేర్పాలి. కుటుంబానికి, స్నేహితులకు, పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాలి.

పోలిక వద్దే వద్దు..

దేన్నీ ఇతరులతో పోల్చుకోకూడదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే ఉదాహరణలతో వివరించాలి. దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజేయాలి.

గాడ్జెట్‌లకు దూరంగా

పిల్లలు గాడ్జెట్‌లకు అలవాటు పడితే వారి లోకంలో వారు ఉంటారు. వారికి స్మార్ట్‌ఫోన్లు అందించే బదులు.. పుస్తకాలు చదివేలా చేయడానికి ప్రయత్నించండి. దగ్గరుండి ముందు చదివించి.. తర్వాత నెమ్మదిగా వారే చదువుకునేలా ప్రోత్సహించండి.

చెప్పుకొనేందుకు అవకాశం

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ విషయాన్నైనా భయం, బిడియం లేకుండా చెప్పగలిగే స్వేచ్ఛనివ్వాలి. వారు ఏం చెప్పినా ఆసక్తిగా వినాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి.

అవసరానికి మించి డబ్బు వద్దు

అవసరానికి మించి డబ్బు ఇవ్వడమంటే తమ పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నట్లే అంటారు సుధామూర్తి. డబ్బు విలువ వారికి తెలియజేయాలి. స్థోమత ఉంటే ఇతరులకు సాయం చేయడం నేర్పించాలి.

వారికంటూ టైమ్‌

ఉరుకుల పరుగులు జీవితంలో తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయం ఉండడం లేదు. ఏ పని ఉన్నా వారితో గడపడం అలవాటు చేసుకోవాలి. ఉన్న కాసేపే అయినా పూర్తి సమయం వారికంటూ కేటాయించాలి.

సమోసాకీ ఓ రోజుంది!

బిర్యానీ రుచిగా రావాలంటే.. ఈ టిప్స్‌ ట్రై చేయండి..

ఉపాధ్యాయ దినోత్సవం(SEP 5).. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సూక్తులు!

Eenadu.net Home