జగన్నాథుడి రథయాత్ర విశేషాలివీ!

ఏటా ఆషాఢ శుక్లపక్షమి పాడ్యమి తిథినాడు పూరీ జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంటుంది. ఈ సారి ఒకేరోజు రథయాత్రతోపాటు నవయవ్వన రూపం, నేత్రోత్సవం కూడా జరుగుతున్నాయి. రథంపై నుంచే భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పిస్తారు.

రథయాత్ర గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో బలరామకృష్ణులు కంసుడిని వధించి విజయం సాధించినందుకుగానూ ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం.

జగన్నాథుడికి జ్వరం వస్తుందట. ‘జననమరణాలు, వ్యాధులు, సుఖదుఃఖాలు నాకు కూడా సమానమే’ అని ఓ పదిహేను రోజులు చికిత్స తీసుకుంటాడు. ఆ తర్వాత కోలుకొని నవయవ్వనంతో బయటకు వస్తాడు. అప్పుడే ఈ రథయాత్ర మొదలవుతుందని నానుడి. 

ద్వాపర యుగాంతం తర్వాత కలియుగంలో పూరీలో ఆవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపుడు జగన్నాథుడు. సంతానం లేని ఇంద్రద్యుమ్న, గుండిచాదేవి రాజ దంపతులు రాజసూయయాగం చేస్తారు.

శ్రీమన్నారాయణుడినే బిడ్డగా పొందాలని కోరుకోవడంతో.. జగన్నాథునిగా సోదరీ, సోదరుల (బలభద్ర, సుభద్ర)తో ఆవిర్భవిస్తానని ఇంద్రద్యుమ్న దంపతులకు వరమిచ్చిన స్వామి తమ రూపాలను తామే తీర్చిదిద్దుకుంటామని చెప్పారట.

తల్లి గుండీచా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా విగ్రహాలను అక్కడికి తీసుకువెళతారు.

రథయాత్ర అన్నాచెల్లెల అనురాగం, అన్యోన్యతకు మారుపేరు. ఈ వేడుకలో పాల్గొనాలని స్వామి వెంట ఉండాలని మహాలక్ష్మి కోరుకున్నా.. జగన్నాథుడు మాత్రం బలభద్ర, సుభద్రలతో పెంచిన తల్లి ఆలయానికి వెళతాడు. 

మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చోబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథిగృహం అన్నమాట! ఈ రథయాత్రకు భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారు.

మట్టితో చేసిన గణనాథుడిని ఎందుకు పూజించాలి?

ప్రసిద్ధి చెందిన గణేశుడి నైవేద్యాలివే!

భారతదేశంలో ప్రాచుర్యం పొందిన శ్రీకృష్ణుడి ఆలయాలు..

Eenadu.net Home