#eenadu

వానాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా ఇన్‌ఫెక్షన్లు వచ్చే ఈ కాలంలో కొన్నింటిని తినకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు..

వర్షాకాలంలో చాలామంది చిరుతిళ్లు, వేపుళ్లు, మిర్చీ బజ్జీలు, పునుగులు, సమోసా వంటివి తినాలనుకుంటారు. కానీ ఇవి నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. తొందరగా జీర్ణం కాదు. ఎసిడిటీ వస్తుంది.

ఈ కాలంలో ఆకుకూరలు, క్యాబేజీ వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. వర్షానికి అవి జీర్ణం కాక విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ తినాల్సి వచ్చినా బాగా శుభ్రం చేసి వండుకోవాలి. 

చేపలు, పీతలు, రొయ్యల వంటి సీఫుడ్స్‌తో బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఎక్కువ. తద్వారా అనారోగ్యానికి గురవుతారు. ఈ సమయంలో మాంసాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.

వర్షంలో పానిపూరీ, ఛాట్‌ వంటివి తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు కొందరు. వీటిల్లో వాడే అపరిశుభ్రమైన నీళ్ల కారణంగా విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు తలెత్తుతాయి. 

పుట్టగొడుగులు సాధారణంగా తడిగా ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయి. కాబట్టి వీటిల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. వండే ముందు వాటిని బాగా శుభ్రం చేయాలి. 

ముందే కట్ చేసిన పండ్లు, కూరగాయలను ఈ కాలంలో తినకూడదు. తేమ ఉన్న చోట బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 

కొందరు కాలంతో సంబంధం లేకుండా ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు తీసుకుంటారు. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లటి పదార్థాలు తింటే గొంతు నొప్పి, జ్వరం, దగ్గు వంటివి ఇబ్బంది పెడతాయి.

పాలతో చేసిన పదార్థాలు వర్షాకాలంలో త్వరగా పాడవుతాయి. కాబట్టి పాశ్చ్‌రైజ్‌డ్‌ పాలను వాడటం మంచిది. పెరుగు, మజ్జిగ తీసుకోవడం ద్వారా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. 

మిగిలిన ఆహారాన్ని మర్నాడు వేడి చేసుకుని తినడం వల్ల అజీర్ణం, వికారం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వానాకాలంలో తాజాగా వండుకుని వేడి వేడిగా తినేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి.

ఆహారమే ఔషధం..

కొబ్బరితో ఎన్నో లాభాలు..

సైకిల్‌ తొక్కితే ప్రయోజనాలు ఏంటి?

Eenadu.net Home