అబుదాబిలో హిందూ ఆలయ విశేషాలివే!

అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇక్కడ స్వామి నారాయణ్‌, రాధా-కృష్ణ, సీతా-రాముడు, శివ-పార్వతి కొలువై ఉంటారు.

బోచసన్వాసి అక్షర్‌పురుషోత్తం స్వామినారాయణ్‌ (BAPS) పేరిట ప్రారంభించిన ఈ దేవాలయానికి ఏడు గోపురాలు ఉంటాయి. అరబ్‌ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు.

రాజస్థాన్‌ పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. 

402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు.

అత్యంత క్లిష్టమైన రీతిలో ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు జగన్నాథుడు, స్వామి నారాయణుడు, వేంకటేశ్వరుడు, అయ్యప్ప కథలను వర్ణించారు.

రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆలయం దిగువ భాగంలో గంగా, యమునా నదీ ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్‌ లైట్లను ఏర్పాటు చేశారు. 

దుబాయి-అబుదాబి మార్గంలో  27 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 42 దేశాలకు చెందిన రాయబారులు తమ జీవిత భాగస్వాములతో కలిసి అద్భుత ఆలయాన్ని సందర్శించారు.

ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్‌ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాటర్‌ ఫీచర్లు, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు, గిఫ్ట్‌ షాపులు ఉంటాయి.

మందిర్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది. భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వంటి వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటాను సేకరిస్తాయి.

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home