వ్యాయామం ఎక్కువైతే తిప్పలు తప్పవు!
ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది వేగంగా బరువు తగ్గాలి, శరీర ఆకృతి బాగుండాలని తీవ్రంగా వ్యాయామాలు చేస్తుంటారు. అలాంటి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
తీవ్రంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒంట్లో నీటి శాతం వేగంగా తగ్గి శరీరం డీహైడ్రేట్‌కు గురవుతుంది. మధ్యమధ్యలో నీళ్లు, పళ్లరసాలు తాగుతూ ఉండాలి.
కొందరు వేగంగా బరువు తగ్గాలని ఎక్కువ సమయం పాటు శక్తికి మించి కష్టపడతారు. అధిక బరువులు మోస్తుంటారు. దీనిద్వారా కండరాలపై ఒత్తిడి పడుతుంది. కొన్నిసార్లు గాయాలవుతాయి.
వ్యాయామానికి శక్తి సరిపోయేట్లుగా ఆహారాన్ని కూడా తీసుకోవాలి. పోషకాలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
బరువు తగ్గడానికి వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో విశ్రాంతి కూడా అంతే అవసరం. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. విపరీతమైన చలి, ఎండలో వ్యాయామం చేయకపోవడమే మంచిది.
వారానికి కనీసం ఒక రోజు వ్యాయామం నుంచి సెలవు తీసుకోవాలి. అప్పుడే మెదడు, కండరాలు చురుగ్గా పనిచేస్తాయి.
అధిక వ్యాయామం వల్ల హార్మోన్లపై ప్రభావం పడుతుంది. దీని వల్ల మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. ఒళ్లు నొప్పులు, నీరసం, కుంగుబాటు, కోపం వంటివి కలుగుతాయి.
అధిక వ్యాయామాలను కొద్ది రోజులు ఆపేయాలనుకున్నప్పుడు పూర్తిగా నిలిపివేయకుండా.. యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఏం చేసినా.. గుండెపై ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.